పుష్ప 2 సినిమా విడుదల నేపథ్యంలో, ప్రీమియర్ షోస్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన వివాదం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ వివాదం విషయమై ప్రతి రోజూ ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించడంతో ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవును, సదరు వివాదాన్ని చిత్ర యూనిట్.. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చారని అభిప్రాయ పడ్డారు. సారీ చెప్పడానికి పలు విధానాలు ఉంటాయని, ఘటన జరిగిన రెండో రోజే వెళ్లి మాట్లాడి ఉంటే ఇంత జరిగేది కాదని అభిప్రాయ పడ్డారు. అయితే ఆఖరిగా ఈ వివాదంలో కేవలం అల్లు అర్జున్ ని మాత్రమే ఒంటరి చేసారని అసహనం వ్యక్తం చేసారు.

ఇక అదే సమయంలో హీరోవైపు కూడా తప్పు ఉందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. దానికి ఉదాహరణగా.. మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రస్తావించారు పవన్. ఒకప్పుడు చిరంజీవి కూడా ఇలా రిలీజ్ రోజు సినిమాలకు వెళ్లేవారని, అయితే ముఖానికి ముసుగు కట్టుకుని మరీ వెళ్లేవారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని, చుట్టూ చాలా కెమెరాలు గమనిస్తున్నాయని అన్నారు. తానూ ఒక్కోసారి కళ్ళు మాత్రమే కనపడేలా వెళ్లినా గుర్తు పట్టేసే వారని అన్నారు. ఇపుడు హీరోలు అలా వెల్దామన్నా అది అంత తేలికైన విషయం కాదని అభిప్రాయపడ్డారు.

ఇక ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమతో గౌరవం, మర్యాదతో వ్యవహరించిందని.. చెప్పుకొచ్చారు. సినిమా విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని ప్రశంసించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంగళగిరిలో మీడియాతో చిట్‌చాట్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్‌ అరెస్టు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి గురించి మాట్లాడడం జరిగింది. పుష్ప 2 సినిమాకు సీఎం రేవంత్‌ పూర్తిగా సహకరించారని, టికెట్‌ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అల్లు అర్జున్‌ విషయంలో ముందు, వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు... కానీ చట్టం అందరికీ సమానం. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టలేం! అని మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: