ఈసారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాలు మారిన సంగతి తెలిసిందే. అయితే గతంలో ఉన్న జ‌గ‌న్, కేసీఆర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పెద్దగా ఎలాంటి ప్రయోజనాలు అందించలేదు. టీడీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఏపీలో టికెట్ రేట్లు నచ్చినట్లు పెంచుకోవచ్చని పచ్చ జెండా ఊపేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా వాళ్లకి మంచే చేసింది. కానీ అప్పటి ప్రభుత్వాల వలె ఇప్పటి ప్రభుత్వాలు కూడా పరిశ్రమపై ఎలాంటి వరాలు జల్లు కురిపించడం లేదు.

దురదృష్టకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ‌లో టాలీవుడ్ ఇండస్ట్రీకి కష్టకాలం మొదలయ్యింది. పుష్ప-2 సినిమా ట్రాజడీ తర్వాత బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడంపై బ్యాన్ విధించారు సీఎం రేవంత్. ఆయనతో సినిమా పెద్దలు మాట్లాడారు కానీ దానివల్ల ఏం ఉపయోగం లేకుండా పోయింది. నిజం చెప్పాలంటే సినీ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు చాలా అవసరం. అప్పుడే టాలీవుడ్‌కి నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. గతంలో ప్రభుత్వాల దృక్పథం అంత ప్రోత్సాహకరంగా లేదు. సినిమా వాళ్లంటే చిన్నచూపు ఉండేది. ఇప్పుడు పరిస్థితులు మారినా, ఈ సంబంధాలు మరింత బలపడాలి.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం సినీ పరిశ్రమ కోసం ఏం చేయబోతుందో స్పష్టమైన ప్రకటన రావాలి. ఇక్కడ తెలంగాణలో జరిగినట్టుగానే, ఏపీలోనూ సినీ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేయాలి. టాలీవుడ్ సమస్యలు, అవసరాలు ప్రభుత్వానికి విన్నవించాలి. ఏపీలోని పెద్దలు సినిమా పరిశ్రమకు మంచి చేయాలనే మంచి ఉద్దేశంతోనే ఉన్నారు. అయితే, వారి మధ్య భారీ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ను తగ్గించే వ్యవస్థ ఏర్పాటు చెయ్యాలి. దీనివల్ల ఇరువర్గాల మధ్య సమన్వయం కుదిరి, సినీ పరిశ్రమ అభివృద్ధి అవ్వగలుగుతుంది.

తెలంగాణలో సినీ పరిశ్రమ బాధ్యతలను దిల్ రాజు తీసుకున్నారు, ఆయన FDC ఛైర్మన్‌గా కూడా ఉన్నారు. రెండింటి మధ్య సంబంధాలు బలోపేతం చేయాల్సిన బాధ్యతను దిల్ రాజు పైనే పెట్టారు. అయితే, టికెట్ ధరల పెంపుదలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. సంక్రాంతి సినిమాలకు టికెట్లు పెంచుకోవడానికి అనుమతిస్తే పరిశ్రమకు అనుకూలంగానే ఉందని స్పష్టంగా తెలుస్తుంది.

దిల్ రాజు పైకి టికెట్ రేట్లు పెద్ద విషయం కాదంటున్నా, సంక్రాంతికి రేట్లు పెరుగుతాయో లేదో అనే భయం అతని ఫేస్ లో కనిపిస్తోంది. ఎందుకంటే సంక్రాంతి బరిలో ఉన్న మూడు సినిమాల్లో రెండు ఈ నిర్మాత ప్రొడ్యూస్ చేసినవే. అందులో 'గేమ్ ఛేంజర్' కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించిన అతిపెద్ద సినిమా. ఇవి వెనక్కి రావాలంటే మూవీ టికెట్ల రేట్లు పెంచాల్సిందే. గతంలో దిల్ రాజు అందుకే టికెట్ల రేట్ల విషయంలో పట్టుబట్టారు. ఇతను ఒక్కడే కాదు అగ్ర నిర్మాతల అసలు లక్ష్యం టికెట్ ధరల పెంపు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ గోల్ నెరవేర్చుకోవాలంటే టాలీవుడ్ పెద్దలు అందరూ కలిసి ఒక గొప్ప ఆలోచన చేయాలి. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం వహించకూడదు.


మరింత సమాచారం తెలుసుకోండి: