లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ ట్రైలర్ కు స్పందన బాగా రావడంతో మెగా అభిమానులు జోష్ లో ఉన్నారు. ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవాడలో నిర్వహించడమే కాకుండా ఆ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ అతిధిగా రాబోతున్న నేపధ్యంలో ఈమూవీ క్రేజ్ మరింత పెరిగే ఆస్కారం కనిపిస్తోంది. ఈపరిస్థితులు ఇలా ఉండగా ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చెన్నైలో కూడ జరపబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా తమిళ హీరో విజయ్ ని నిర్మాత దిల్ రాజ్ ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో దిల్ రాజ్ విజయ్ తో ‘వారసుడు’ మూవీ తీసిన నేపధ్యంలో వీరిద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది. ఆసాన్నిహిత్యంతోనే విజయ్ ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ‘గేమ్ ఛేంజర్’ మూవీ కథను దర్శకుడు శంకర్ తమిళ హీరో విజయ్ ని దృష్టిలో పెట్టుకుని వ్రాసినట్లు తెలుస్తోంది.
అయితే అప్పటికే విజయ్ ‘బీస్ట్’ సినిమా చేస్తున్న పరిస్థితులలో దర్శకుడు శంకర్ తో విజయ్ సినిమా చేయడానికి ఆశక్తి కనపరచలేదు అని కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. గతంలో శంకర్ విజయ్ ల కాంబినేషన్ లో బాలీవుడ్ హిట్ మూవీ ‘త్రీ ఈడియట్స్’ మూవీ తమిళంలో తీసినప్పటికీ ఆమూవీ పెద్దగా విజయవంతం కాలేదు అన్నవిషయం తెలిసిందే. విజయ్ ఆశక్తి కనపరచని ‘గేమ్ ఛేంజర్’ కథ ఎంతవరకు రామ్ చరణ్ కు అదృష్టాన్ని కలిగిస్తుందో చూడాలి..