వేలాది మంది ప్రేక్షకుల సమక్షంలో, లక్షలాది మంది వీక్షిస్తుండగా పవన్ ఇలా అనడంతో ఎస్.జె.సూర్య ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఆ సమయంలో సూర్య ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ, ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో సూర్య పవన్ కళ్యాణ్ కోరికను సున్నితంగా తిరస్కరించారు. "నేను డైరెక్షన్ చేయను" అని కుండబద్దలు కొట్టారు.
ఒకవేళ డైరెక్షన్ చేయాలనే ఆలోచన లేకపోయినా, పవన్ కళ్యాణ్ మాటను గౌరవించి, "ప్రయత్నిస్తాను" అని చెప్పి ఉంటే బాగుండేది. కానీ, సూర్య మాత్రం "డైరెక్షన్ నాకు అవసరం లేదు" అన్నట్టుగా మాట్లాడటం పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశపరిచింది. పవన్ తనపై ఉంచిన నమ్మకాన్ని సూర్య తేలిగ్గా తీసుకున్నట్లు అనిపించింది.
నటుడిగా ఉండటమే తనకు కంఫర్ట్‌గా ఉందని, ఇప్పట్లో డైరెక్షన్ చేసే ఆలోచన లేదని సూర్య స్పష్టం చేశారు. అయితే, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఎస్.జె.సూర్య పవన్ కళ్యాణ్‌తో మాత్రం ఒక సినిమా డైరెక్ట్ చేస్తానని అంటున్నారు. ఒకవేళ అది కుదరకపోతే పవన్ కుమారుడు అకిరా నందన్‌ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చెప్పారు. అంతేకాదు, అకిరాతో 'ఖుషి' సీక్వెల్ తీస్తానని కూడా ప్రకటించారు.
రాజమండ్రిలో అకిరాను స్వయంగా చూశానని, అతను తన తండ్రిలాగే ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ ఉంటాడని సూర్య తెలిపారు. అకిరా అద్భుతంగా ఉన్నాడని, అతను ఒప్పుకుంటే 'ఖుషి 2' చేయడానికి ఆలోచిస్తానని అన్నారు. 'గేమ్ ఛేంజర్' సినిమాలో తాను పోషించిన నెగెటివ్ రోల్ తనకు చాలా నచ్చిందని, అందుకే స్వయంగా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పుకున్నానని సూర్య చెప్పారు. మొత్తానికి, పవన్ కళ్యాణ్ కోరికను సున్నితంగా తిరస్కరించిన ఎస్.జె.సూర్య, పవన్, అకిరా కోసం మాత్రం డైరెక్షన్ చేస్తానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.