- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


తెలుగు చ‌ల‌న చిత్ర చరిత్ర‌లో రేలంగి, రాజ‌బాబు త‌ర్వాత‌.. అంత‌టి హాస్యం పండించ‌డంలో త‌న‌కంటూ తిరుగులేని న‌ట‌న‌ను సొంతం చేసుకున్న హాస్య బ్ర‌హ్మ‌.. బ్ర‌హ్మానందం. ఇప్ప‌టికే ఆయ‌న హిస్ట‌రీలో 1100 సినిమాలు చేరిపోయాయి. అయితే.. ఇన్ని సినిమాల్లో చేసినా.. ఆయ‌న జంధ్యాల సినిమాల‌ను ఇప్ప‌టికీ మ‌రిచిపోలేరు. ఎందుకంటే.. ఆయ‌నే ఈయ‌న‌కు హాస్య భిక్ష పెట్టారు కాబ‌ట్టి.


అందుకే.. జంధ్యాల సినిమాల్లో సీన్ల‌ను ఇప్ప‌టికీ బ్ర‌హ్మానందం గుర్తు చేసుకుంటూనే ఉంటారు. వివాహభోజనంబు సినిమా నుంచి అహ‌నాపెళ్లంట వ‌ర‌కు.. అనేక సినిమాల్లో జంద్యాల‌-బ్ర‌హ్మీ సూప‌ర్ డూప‌ర్ కాంబినేష‌న్‌. ఈ సినిమాలో స‌ముద్రం ఒడ్డున తలవరకూ  భూమిలో పాతిపెట్టే సీన్ ఉంది. అయితే.. ఈ సీన్ తీసిన‌ప్ప‌టి సంగ‌తులు ఇప్ప‌టికీ త‌న‌కు గుర్తున్నాయ‌ని.. జీవితాంతం వాటిని మ‌రిచిపోలేనని బ్ర‌హ్మానందం అనేక సంద‌ర్భాల్లో చెప్పారు.


``నేనేమో ఆ గోతిలోనే ఉండి రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వాలి. సాధారణంగా ఇలాంటి సన్నివేశాల్లో చిన్న చిన్న ట్రిక్కులు ప్లే చేస్తుంటారు. నిజంగా పాతిపెట్టకుండా.. ఓ చెక్కపెట్టెలో మమ్మల్ని నిలబెట్టి.. చుట్టూ మట్టి పేరుస్తారు. కానీ, ఆరోజు నన్ను నిజంగానే పాతేశారు. సరిగ్గా ఆ సమయానికి ఓ కుక్క అటువైపుగా వస్తోంది. దాన్ని చూసి వెంటనే జంధ్యాల గారు ‘‘ఏ ఊరకుక్కయినా దగ్గరకొచ్చి కాలెత్తితే పావనమైపోతుంది మహాప్రభో’’ అనే డైలాగ్‌ అప్పటికప్పుడు రాశారు’’ అని బ్ర‌హ్మీ చెప్పుకొచ్చారు.


అలాగే.. అహ‌నాపెళ్లంట సినిమాతో తొలి ఎంట్రీ ఇచ్చిన స‌మ‌యంలో కూడా.. ముందు.. త‌న క్యారెక్ట‌ర్‌లో న‌త్తిలేద‌ని బ్ర‌హ్మానందం చెప్పుకొచ్చారు. రెండుసీన్‌లు కూడా.. మామూలుగానే తీసేశార‌ట‌. అయితే.. ఈ సీన్ తీస్తున్న స‌మ‌యంలో టీ అమ్మేవాడు వ‌చ్చి.. లొకేష‌న్‌లో అంద‌రికీ టీ ఇస్తూ.. న‌త్తిగా మాట్లాడ‌డంతో అది జంధ్యాల గారికి న‌చ్చేసింద‌ట‌. దీంతో అప్పుడే ఈ న‌త్తిని త‌న సినిమాలో పెడితే ఎలా ఉంటుంద‌ని ఆలోచించి... వెంట‌నే అహ‌నా పెళ్లంట సినిమాలో బ్ర‌హ్మీని న‌త్తి కేర‌క్ట‌ర్ చేసేశార‌ట‌. ఈ సీన్ అద్భుతంగా పండింది.

మరింత సమాచారం తెలుసుకోండి: