సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇటీవల ఈ సినిమా టికెట్ ధరల విషయంలో సీఎంతో మరోసారి చర్చిస్తానని, ఆయన సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం ఉందని దిల్ రాజు పేర్కొన్నారు. ఆయన ఆశించిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. కానీ 'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ ధరను ఇష్టారాజ్యంగా పెంచడానికి వీలు లేదని స్పష్టం చేసింది. నిర్ణీత మొత్తంలో మాత్రమే టికెట్ ధరను పెంచాలని నిబంధనలు పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. మాట తప్పడం కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉంది అనడానికి ఈ నిర్ణయం ఒక పెద్ద నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. జనవరి 10వ తేదీన ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్‌కు టికెట్ ధరలను పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. మల్టీప్లెక్స్ టికెట్‌కు అదనంగా రూ.150 పెంపుకు, సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్‌కు అదనంగా 100రూపాయలు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అదే విధంగా జనవరి 11న వేసే 5షోస్‌కు టికెట్ ధరల పెంపులో కొన్ని సవరణలు చేసింది. జనవరి 11 నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపుకు, సింగిల్ స్క్రీన్ ధర 50 రూపాయలు పెంపు కు అనుమతించింది. కాగా బెనిఫిట్ షోలకు అనుమతివ్వడానికి మాత్రం నిరాకరించింది. ఇదిలా ఉంటే 3 డిసెంబర్ 2024న అల్లు అర్జున్ నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడు ఇప్పటికి కూడా చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. ఈ ఘటన జరిగిన నేపథ్యంలో తాను సీఎం సీటులో ఉన్నంత కాలం తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతివ్వమని, టికెట్ ధరల పెంపుకు కూడా అనుతివ్వమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. ఆ తర్వాత సినీ పెద్దలతో జరిగిన సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి తన వాదనను వినిపించారు. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే ప్రస్తే లేదన్నారు. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలో మనసు మార్చుకోవడంతో ఈ అంశం కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: