కథ :
అవినీతితో పాలన సాగించిన బొబ్బిలి సత్యమూర్తిని( శ్రీకాంత్) గతంలో చేసిన కొన్ని తప్పులు కలల రూపంలో వెంటాడటంతో పాటు ప్రజల్లో అతనిపై వ్యతిరేకత ఉంటుంది. అదే సమయంలో ఫ్లై ఓవర్ కూలిపోవడం, ప్రజల శాపనార్థాలను గమనించిన సత్యమూర్తి పార్టీ నేతలకు మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే వరకు మెరుగైన పాలన అందించాలని ఆదేశిస్తాడు. అయితే సత్యమూర్తి పెంపుడు కొడుకైన మోపిదేవి (ఎస్జే సూర్య) మాత్రం తండ్రి చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
తండ్రి చనిపోతే పదవి దక్కుతుందనే ఆశతో ఉన్న మోపిదేవి తండ్రికి తెలియకుండా అవినీతి, అక్రమాలను కొనసాగిస్తూ ఉంటాడు. అయితే ఎవరు తప్పు చేసినా క్షమించని నిజాయితీ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ ( రామ్ చరణ్) మోపిదేవి అక్రమ ఇసుక తవ్వకాలకు అడ్డు తగలడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలవుతుంది. రామ్ నందన్ రూల్స్ సక్రమంగా పాటించడం నచ్చని మోపిదేవి ఒకానొక సందర్భంలో కలెక్టర్ పై చేయి కూడా చేసుకుంటాడు.
తండ్రి మరణిస్తే తనకే సీఎం పదవి దక్కుతుందని భావించిన మోపిదేవికి తండ్రి చివరి కోరికకు సంబంధించిన వీడియో వల్ల ఊహించని షాక్ తగులుతుంది. మోపిదేవి వల్ల సస్పెండ్ అయిన రామ్ నందన్ కెరీర్ ఊహించని మలుపు తిరుగుతుంది. రామ్ నందన్, సత్యమూర్తి మధ్య అనుబంధం ఏంటి? రామ్ నందన్ తండ్రి అప్పన్న లక్ష్యాన్ని నెరవేర్చాడా? మానసిక ఆస్పత్రిలో జీవితాన్ని గడుపుతున్న పార్వతి(అంజలి) పాత్ర ట్విస్టులేంటి? రామ్ నందన్ మోపిదేవి ఎత్తులను ఎలా చిత్తు చేశాడు? అనే ప్రశ్నలకు జవాబే గేమ్ ఛేంజర్.
కథనం విశ్లేషణ :
శంకర్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఆయన అభిమానులకు ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, రోబో సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే గత 15 సంవత్సరాలలో శంకర్ గ్రాఫ్ అంతకంతకూ తగ్గుతోంది. అయితే గేమ్ ఛేంజర్ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథను పర్ఫెక్ట్ గా తెరకెక్కించడంలో శంకర్ సక్సెస్ అయ్యారు. రొటీన్ కథే అయినా శంకర్ మార్క్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా తెరకెక్కింది.
ఇండియన్2 సినిమాతో తీవ్ర విమర్శల పాలైన శంకర్ గేమ్ ఛేంజర్ విషయంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడ్డారు. సీన్స్, సాంగ్స్, ఫైట్స్ విషయంలో పూర్తిస్థాయిలో న్యాయం చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ గా రామ్ నందన్ పాత్రలో, అప్పన్నగా మరో పాత్రలో చరణ్ ఒదిగిపోయారు. కొన్ని సన్నివేశాల్లో అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. చరణ్ కు జోడీగా కియారా దీపిక అనే మెడికో రోల్ లో నటించగా సినిమాలో ఆమె రోల్ సాంగ్స్ కు మాత్రమే పనికొచ్చింది.
అంజలి అప్పన్న భార్య పాత్రలో, 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రలో సినిమాలో కనిపించగా రెండు పాత్రల్లో ఆమె లుక్స్ ఆకట్టుకున్నాయి. అంజలి కొండదేవర సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ వేసి ఆకట్టుకున్నారు. ట్రైలర్ లో ఆమె రోల్ ను ఎందుకు రివీల్ చేయలేదో సినిమా చూస్తే అర్థమవుతుంది. శ్రీకాంత్ కు సెకండ్ ఇన్నింగ్స్ లో దక్కిన బెస్ట్ రోల్స్ లో గేమ్ ఛేంజర్ ఒకటి. ఎస్జే సూర్య మోపిదేవి పాత్రతో నటుడిగా ఎన్నో మెట్లు పైకి ఎక్కారు. ఎస్జే సూర్య లౌడ్ వాయిస్ తో చెప్పే డైలాగ్స్ ఆకట్తుకున్నాయి. రామ్ నందన్ ను మోపిదేవి ఇరుకున పెట్టే సీన్స్ అద్భుతంగా పేలాయి.
సాంకేతిక నిపుణుల పనితీరు :
టెక్నికల్ గా గేమ్ ఛేంజర్ మూవీ ఈ మధ్య కాలంలో విడుదలైన ఏ పెద్ద సినిమాకు తీసిపోని రేంజ్ లో ఉంది. థమన్, శంకర్ సినిమా కోసం బాగానే కష్టపడ్డారు. కొన్ని సన్నివేశాలకు బీజీఎం అద్భుతంగా కుదిరింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విషయంలో వంకాలు పెట్టడానికేం లేదు. నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ కలెక్షన్లు లాభాల విషయంలో కూడా టాప్ లో నిలిచే ఛాన్స్ అయితే ఉంది.
లాలు :
రామ్ చరణ్ అద్భుతమైన నటన
కథలో ఆసక్తికర ట్విస్టులు
ఇంటర్వెల్ బ్యాంగ్
బలహీనతలు :
కియారా అద్వానీ
కొన్ని రొటీన్ సన్నివేశాలు
ఒక్క డైలాగ్ కూడా లేని సీన్స్ లో స్టార్ కమెడియన్లు కనిపించడం
బాటమ్ లైన్ : చరణ్ ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ లా గేమ్ ఛేంజర్
రేటింగ్ : 3.0/5.0