క్రేజీ హీరో విజయ్ దేవరకొండ వరస ఫ్లాప్ లతో సతమైపోతున్న పరిస్థితులలో అతడికి ప్రస్తుతం ఒక సూపర్ హిట్ కావాలి. ఇలాంటి పరిస్థితులలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అతడు నటిస్తున్న మూవీ పై అంచనాలు బాగా ఉన్నాయి. శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ రెండు భాగాలుగా విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది.
ఈమూవీ చేస్తూనే విజయ్ ‘టాక్సీ వాలా’ మూవీ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక మూవీని చేయడానికి అంగీకరించడంతో ఆమూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తో పాటు నటీనటుల ఎంపిక కూడ కొనసాగుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకులుగా పేరుగాంచిన అజయ్ అతుల్ ఎంపిక అయ్యారని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా పేరుగాంచిన వీరు మరాఠి నేపధ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం హిందీ సినిమాలకు వీరిద్దరూ చాల ఎక్కువగా పని చేస్తున్నారు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీలోని చాల పాటలకు వీరిద్దరూ సంగీత దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. గతంలో హృతిక్ రోషన్ నటించిన ‘అగ్నిపథ్’ ‘సూపర్ 30’ ‘సింగం’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు వీరు సంగీత దర్శకత్వం వహించడంతో వీరిద్దరూ బాగా బిజీగా ఉన్నప్పటికీ వారు ఈమూవీకి పనిచేయడానికి ఒప్పుకోవడానికి గల కారణం ఈమూవీ కథ అని అంటున్నారు.
త్వరలో హైదరాబాద్ తో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఈమూవీ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. చరిత్రలో అందరికీ తెలియని ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈమూవీని తీస్తున్నట్లు తెలుస్తోంది. వరస ఫ్లాప్ ల మధ్య సతమతమైపోతున్న విజయ్ తన పద్దతి మార్చి సినిమా కథల ఎంపికలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ మూవీ తరువాత ఎవరు ఊహించని టాప్ రేంజ్ కి వెళ్ళిన విజయ్ ప్రస్తుతం తన సినిమాల విషయంలో తదాబాటు పడటం అతడి అభిమానులకు టెన్షన్ గా మారింది..