దర్శకుడు శంకర్, రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబినేషన్‌లో వచ్చిన 'గేమ్ ఛేంజర్' సినిమా జనవరి 10న విడుదలై బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపేసింది. మొదటి రోజే ఏకంగా రూ.51 కోట్లు కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ హిట్ అనిపించుకుంది. రామ్ చరణ్ అభిమానులైతే పండగ చేసుకున్నారు. కానీ, కలెక్షన్ల విషయంలో ఊహించని మలుపు తిరిగింది.

వారాంతం తర్వాత సోమవారం వచ్చేసరికి కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. సోమవారం కేవలం 8.5 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. ఇది నిజంగా నిరాశపరిచే విషయమే. ప్రముఖ ట్రేడ్ సైట్ సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం తెలుగు థియేటర్లలో సోమవారం ఆక్యుపెన్సీ కేవలం 20 శాతమే నమోదైంది. రెండో రోజు నుంచే కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. మొదటి రోజు 51 కోట్లు వసూలు చేస్తే, రెండో రోజుకు వచ్చేసరికి 21.6 కోట్లకు పడిపోయింది. అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు తేడా, ఇక ఆదివారం దేశవ్యాప్తంగా కేవలం 15.9 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి.

ప్రస్తుతం ఇండియాలో ఈ సినిమా మొత్తం 97 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే 100 కోట్ల క్లబ్‌లో చేరడానికి చాలా దగ్గరలో ఉంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నా, రోజురోజుకూ థియేటర్లలో జనాలు తగ్గిపోతున్నారు. ఇది కాస్త ఆందోళన కలిగించే విషయమే.

'గేమ్ చేంజర్' సినిమాను తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ భాషల్లో కూడా విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్‌లో అదరగొట్టాడు. తండ్రీకొడుకులుగా (హెచ్. రామ్ నందన్, అప్పన్న) రెండు విభిన్న పాత్రల్లో కనిపించాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా రామ్ చరణ్ భార్య దీపిక పాత్రలో నటించింది.

హిందీ వెర్షన్ విషయానికి వస్తే, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సోమవారం బాక్సాఫీస్ నంబర్లను షేర్ చేశారు. సినిమాకు మంచి టాక్ వచ్చినా, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని ఆయన అన్నారు. భారీ బడ్జెట్, అంచనాలు ఉన్న సినిమాకు మూడు రోజుల వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. శుక్రవారం 8.64 కోట్లు, శనివారం 8.43 కోట్లు, ఆదివారం 9.52 కోట్లు.. మొత్తంగా చూస్తే హిందీలో 26.59 కోట్లు వసూలయ్యాయి. అయితే, సినిమాను నిర్మించడానికి పెట్టిన ఖర్చుతో పోలిస్తే ఈ వసూళ్లు ఇంకాస్త ఎక్కువగా ఉండాల్సిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. చూస్తుంటే, 'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ ప్రయాణం ఊహించినంత సాఫీగా మాత్రం సాగడం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: