ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సందీప్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. తన చేజారిపోయిన రెండు బ్లాక్‌బస్టర్ సినిమాల గురించి వెల్లడించాడు. దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రాల్లో మొదట తననే హీరోగా అనుకున్నారట. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ రెండు సినిమాల్లో నటించే ఛాన్స్ మిస్ అయిందని, ఆ సినిమాలు వేరే హీరోల దగ్గరికి వెళ్లి బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయని చెప్పాడు. ఒకవేళ ఆ సినిమాలు తన ఖాతాలో ఉండి ఉంటే, తన కెరీర్ ఇంకో లెవెల్‌కి వెళ్లేదని సందీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అయినా, ఇప్పుడు వస్తున్న అవకాశాల పట్ల తను చాలా సంతోషంగా ఉన్నానని స్పష్టం చేశాడు.
సందీప్ కెరీర్ ‘స్నేహగీతం’ సినిమాతో మొదలైనా, అతనికి మంచి గుర్తింపు తెచ్చింది మాత్రం ‘ప్రస్థానం’లోని నెగెటివ్ రోలే అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుంచే కాకుండా, సినీ విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. అటుపైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ లాంటి హిట్‌తో హీరోగా సత్తా చాటాడు. కానీ తర్వాత సరైన స్క్రిప్ట్స్ తన దగ్గరికి రాకపోవడంతో హీరోగా కొంచెం వెనకబడ్డాడు.
టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు సందీప్. ధనుష్ హీరోగా నటించిన ‘రాయన్’ సినిమాలో సందీప్ కనిపించాడు. ఆ సినిమాలో తన నటనకు తమిళ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇన్ని ప్రయత్నాలు చేసినా, తెలుగులో హీరోగా మాత్రం ఇంకా సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు.
కొద్ది రోజుల క్రితం ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్. ఆ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చినా, కమర్షియల్‌గా మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు సందీప్ తన నెక్స్ట్ మూవీ ‘మజాకా’ కోసం రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాడు.
‘మజాకా’ సినిమాపై సందీప్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. రీసెంట్‌గా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌లో సినిమా గురించి చాలా ఎగ్జైటెడ్‌గా మాట్లాడాడు. సినిమా టీజర్‌కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందని, కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో పాటు, మాస్ ఆడియన్స్‌ను కూడా బాగా ఆకట్టుకుంటుందని, తన పెర్ఫార్మెన్స్ అదిరిపోతుందని చెప్పాడు.