కొన్ని కొన్ని విష‌యాల్లో శోభ‌న్‌బాబు చాలా మంకు ప‌ట్టుతో ఉండేవారు. ముఖ్యంగా క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ఆయ‌న మారుపేరుగా నిలిచేవారు. టైం అంటే టైమే అని చెప్పేవారు. ఉద‌యం 6 గంట‌ల‌కు షూటింగు ప్రారంభ మ‌వుతుంద‌ని చెబితే.. 5 గంట‌ల 30 నిమిషాల‌కే ఆయ‌న స్పాట్‌లో ఉండేవారు. సాయంత్రం 6 గంట‌ల‌కు షూటింగ్ బంద్ అని చెబితే.. ఖ‌చ్చితంగా ఆయ‌న ఆ స‌మాయానికి కారెక్కేసేవారు. దీంతో కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో చిక్కులు వ‌చ్చాయి.


మాన‌వుడు దాన‌వుడు సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. అణువు అణువున నిలిచిన దేవా.. పాట షూటింగ్ చేస్తున్నారు. ఈ షూటింగ్‌లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు పాల్గొన్నారు. గ్రూప్ సాంగ్ చిత్రీక‌రిస్తున్నారు. అయితే.. దీనికి షెడ్యూల్ ప్ర‌కారం.. స‌మ‌యానికి రావాల్సిన శార‌ద కొంచెం లేట‌య్యారు. దీంతో మొత్తం పాట‌ను ఒకే రోజు చిత్రీక‌రించి.. పూర్తి చేయాల‌న్న డైరెక్ట‌ర్ ప్లాన్ కొంచెం తేడా వ‌చ్చింది. మొద‌టి చ‌ర‌ణాన్ని పూర్తి చేశారు. ఇది ఇన్‌డోర్ షూటింగ్‌. అయితే.. అప్ప‌టికే స‌మ‌యం 5 గంట‌లు కావ‌డంతో శోభ‌న్‌బాబు మేక‌ప్ తీసేశారు.


దీంతో ద‌ర్శ‌కుడు ఆయ‌న‌ను ఇదేంటి స‌ర్‌.. ఇంకో చ‌ర‌ణం వ‌ర‌కు ఉంటే.. షూటింగ్ అయిపోతుంద‌ని చెప్పారు. కానీ, శోభ‌న్‌బాబు.. ముందు నాకు ఇచ్చిన టైం ఏంటి?  అని ప్ర‌శ్నించి.. మారు మాట్లాడ‌కుండా.. కారెక్కి వెళ్లిపోయారు. దీంతో డైరెక్ట‌ర్ ఈ విష‌యాన్ని ర‌చ్చ చేశారు. ఇంత మంది ఆర్టిస్టులు మ‌ళ్లీ ఒకే వేదిక‌పై ఎప్పుడు క‌లుస్తారో.. అని ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేశారు. అయితే.. ఈ ర‌గ‌డ‌లో కృష్ణ జోక్యం చేసుకుని బాబుది త‌ప్పేంటి?  మీరు ఇచ్చిన షెడ్యూల్ ప్ర‌కారం షూటింగ్‌కు వ‌చ్చారు క‌దా.. అని స‌మ‌ర్థించారు.


చివ‌ర‌కు ఈ రెండో చ‌ర‌ణంలో శోభ‌న్‌ను ఒక్క‌డినే చూపిస్తూ.. పాట‌ను ముగించ‌డం విశేషం. అంతేకాదు.. రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనూ శోభ‌న్‌బాబు క‌చ్చితంగా ఉండేవారు. త‌న‌కు ఇస్తాన‌న్న ప్ర‌తి రూపాయినీ ఆయ‌న చివ‌రి షెడ్యూల్ నాటికే వ‌సూలు చేసుకునేవారు. లేక పోతే.. కారు దిగేవారు కాద‌ట‌. దీనిని కూడా కృష్ణ స‌మ‌ర్థించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. చిత్రం ఏంటంటే.. కృష్ణ మాత్రం రెమ్యూన‌రేష‌న్ ఎంత ? అని చూసుకోకుండా.. సినిమాలు పూర్తి చేసేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: