బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇతనిపై జనవరి 16, 2025 రోజున ఓ దొంగ కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది. మొదట నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్న పనిమనిషిపై అటాక్ చేయడంతో దానిని ఆపే క్రమంలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. దోపిడి చేసే క్రమంలో భాగంగానే ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడిలో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడు. అతని శరీరంపై ఆరుకు పైగా కత్తిపోట్లు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. 

ఎడమ చేతిపై రెండు లోతైన గాయాలు, మెడపై ఒక లోతైన గాయం, వెన్నెముక దగ్గర కత్తిపోటు ఉందని వైద్యులు వెల్లడించారు. అతని శరీరంలో కత్తి కూడా ఉంది. వైద్యులు దానిని శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు. సైఫ్ అలీఖాన్ పై జరిగిన కత్తి దాడి యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేసిన అసలు నిందితుడిని ముంబై పోలీసులు శనివారం రోజున అర్ధరాత్రి థానేలో అరెస్టు చేశారు.

నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టుగా పోలీసులు ఆదివారం రోజున తెలిపారు. నిందితుడి బంగ్లాదేశ్ జాతీయుడని సూచించే కొన్ని పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి దీక్షిత్ గెడం మీడియాకు వెల్లడించారు. నిందితుడి అసలు పేరు మహమ్మద్ షరీఫుల్ ఇస్లాం అని పోలీసులు వెల్లడించారు. భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత విజయ్ దాస్ గా తన పేరును మార్చుకున్నట్లుగా వెల్లడించారు. అతని వద్ద భారతీయుడు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు కూడా లభించలేదని అన్నారు.

నిందితుడు 5, 6 నెలల క్రితం ముంబైకి వచ్చినట్లుగా చెప్పారు. ముంబై థానేలలో వేరువేరు ప్రాంతాలలో నిందితుడు పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు మహమ్మద్... నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడినట్లుగా తెలిపారు. ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: