ఏ సినిమాకు అయినా.. దర్శకుడు కెప్టెన్. సినిమాకు తనే మూలం. హీరోల డామినేషన్ బాగా కొనసాగుతున్న రోజుల్లో కూడా.. ద‌ర్శ‌కుడిగా తనకంటూ ఓ క్రేజ్‌ తెచ్చుకున్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. హీరో ఎవరైనా సరే ఇది దాసరి సినిమా అనిపించుకున్నారు. దర్శకుడు అనేవాడు ఎలా ఉండాలి అనే ప్రశ్నకు సమాధానం గా నిలిచారు. సెట్‌లో దర్శకుడు మాటే నెగ్గాలి అనుకునే తత్వం దాసరికి ముందు నుంచి ఉంది. తన తొలి సినిమా తాత మనవడుతోనే అది నిరూపించుకున్నారు. దాసరి తాతా మనవడు సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు దాసరి. అందులో తాతగా ఎస్విఆర్, మనవడిగా రాజబాబు నటించారు.


ఎస్విఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది.. ఆయన స్టార్‌ల‌కే స్టార్. ఆయన సెట్‌లో అడుగు పెట్టారు అంటే అంతటా సైలెన్స్. డైలాగ్ చెప్పాడంటే కెమెరా కూడా షేక్ అయిపోవాల్సిందే. పెద్ద పెద్ద దర్శకులు కూడా ఎస్‌విఆర్‌ మనసుకు.. ఆయన తగినట్టుగా నడుచుకుంటారు. అలాంటి నటుడిని తొలి సినిమాతోనే డీల్ చేయాల్సి వచ్చింది దాసరికి. సినిమాలో కీలకమైన సన్నివేశం తీస్తున్నారు. దాదాపుగా సినిమాలో కీలక నటినటులందరూ ఆ సీన్‌లో ఉంటారు. ఎస్ వి ఆర్‌కు ఓ పెద్ద డైలాగ్ రాసారు దాసరి. అది ఏకంగా 10 పేజీలు ఉంది. సహాయకుడు రేలంగి నరసింహారావు ఆ డైలాగ్ పేపర్‌ ని ఎస్వీఆర్ దగ్గరకు తీసుకువెళ్లారు. నేను చదవను కానీ.. నువ్వు చదివి వినిపించు అన్నారు ఎస్ వి ఆర్.


రేలంగి ఆ డైలాగ్ పేపర్ చదువుకుంటూ వెళుతుంటే.. ఎస్వీఆర్ మనసులోనే స్మరణం చేసుకుంటూ ఈ డైలాగ్ ఇక్కడ కట్ చెయ్.. ఇది తీసేయ్.. అంటూ ఎడిట్ చేసుకుంటూ 10 పేజీల డైలాగ్ కాస్త మూడు పేజీలకు కుదించారు. మ్యాటర్ అంతా ఈ మూడు పీజీల్లో కన్వే అవుతుంది. వెళ్లి మీ డైరెక్టర్‌కు చెప్పు అన్నారట. ఆయన ఇదే వార్త దాసరి దగ్గరకు వెళ్లి ఆయన చెవిలో చెప్పారు రేలంగి. వెంటనే దాసరి.. ఎస్‌విఆర్ దగ్గరికి వెళ్లారు. 10 పేజీలో డైలాగ్ మూడు పేజీలకు కుదించారు. కానీ.. ఈ సీన్‌లోకి డైలాగులు అన్ని అవసరమే.. నటుడుగా మీకు ఈ సీను మాత్రమే తెలుసు. నాకు ఈ సీనుకు ముందు జరిగే కథ‌.. తర్వాత జరగబోయే కథ కూడా తెలుసు. పది పేజీల డైలాగులు చెప్పాలని సున్నితంగా వివరణ ఇచ్చుకున్నారట దాసరి.


వెంటనే ఎస్వీఆర్‌కు కోపం వచ్చింది. చేతిలో స్టిక్‌ విసిరి కొట్టి.. రైటర్లు.. దర్శకులు అయితే ఇదే తలనొప్పి అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారట. ఆ తర్వాత ఎస్వీఆర్ మనసు మార్చుకుని ఐదు నిమిషాలలో తిరిగివచ్చి.. పది పేజీల డైలాగ్ ఇస్తే నేను చెప్పలేను అనుకుంటున్నాడా మీ డైరెక్టర్.. పది పేజీలు ఏంటి 20 పేజీల డైలాగ్స్ అయినా చెపుతా అంటూ టకటక ఆ డైలాగులు స్మరణ చేసుకొని ఒకే షాట్ లో చెప్పి.. ఓకే చేయించుకున్నారట. ఆ రోజు షూటింగ్ అయ్యి ఇంటికి వెళుతుంటే భలేవాడివి అయ్యా డైరెక్టర్.. ఆఖరికి నువ్వు అన్నదే ప్రూవ్ చేసుకున్నావు అని అభినందించారట.

మరింత సమాచారం తెలుసుకోండి: