* క్రిష్ దర్శకత్వంలో వచ్చిన గమ్యం, ఆయన కెరీర్‌లోనే స్పెషల్గా నిలిచింది.

* రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో శర్వానంద్, అల్లరి నరేష్ నటన అద్భుతంగా ఉంటుంది.

* నరేష్ కెరీర్‌ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తెలుగు సినిమా రూపురేఖలు మార్చిన చిత్రాల్లో గమ్యం ఒకటి.

( తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

2008 ఫిబ్రవరి 29న విడుదలైన 'గమ్యం' సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. రాధా కృష్ణ జాగర్లమూడి అలియాస్ క్రిష్‌ దర్శకత్వం వహించిన ఈ లవ్-సోషల్ డ్రామా ఫిల్మ్ వినోదానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చింది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో శర్వానంద్, అల్లరి నరేష్, కమలినీ ముఖర్జీ కీరోల్స్ ప్లే చేశారు. మంచి కథ, అందరికీ కనెక్టయ్యే పాత్రలు, అద్భుతమైన నటనతో 'గమ్యం' ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది, విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

సినిమా స్టోరీ విషయానికొస్తే, అభిరామ్ (శర్వానంద్) అనే ధనవంతుడు, తన గురించి మాత్రమే ఆలోచించే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతడు జానకి (కమలినీ ముఖర్జీ) అనే ఒక డాక్టర్‌ను ప్రేమిస్తాడు. జానకి సమాజ సేవలో నిమగ్నమవుతుంది. అభిరామ్ జానకి అందానికి ముగ్ధుడవుతాడు, కానీ ఆమె చేసే సేవలను, ఆలోచనలను మాత్రం పట్టించుకోడు. అందుకే వారిద్దరి దగ్గర కాలేరు. దీంతో అభిరామ్ జానకి కోసం ఒక రోడ్డు ప్రయాణం మొదలుపెడతాడు. ఈ ప్రయాణం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. తనను తాను తెలుసుకుంటాడు, ప్రేమ, మానవత్వం, నిజమైన విలువను గ్రహిస్తాడు.

అల్లరి నరేష్ 'గాలి శీను' పాత్రలో అద్భుతంగా నటించాడు. పల్లెటూరి వ్యక్తిత్వం కలిగిన, అందరినీ ఆకట్టుకునే పాత్రలో నరేష్ జీవించాడు. అభిరామ్ ప్రయాణంలో గాలి శీను ఒక ముఖ్యమైన భాగంగా నిలుస్తాడు. గాలి శీను కామెడీ టైమింగ్, ఎమోషన్స్ ను పలికించే విధానం కథకు మరింత బలాన్ని చేకూరుస్తాయని అనడంలో సందేహమే లేదు. జానకి పాత్రలో కమలినీ ముఖర్జీ చాలా సహజంగా నటించి కుర్రాలకు డ్రీమ్ గర్ల్ అయిపోయింది.

శర్వానంద్ తో పాటు గాలి శీను పాత్రలో నరేష్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఈ పాత్ర ద్వారా అతను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. రావు రమేష్, ఎంఎస్ నారాయణ, ఎల్ బి శ్రీరామ్, విద్యాసాగర్ వంటి సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా ఎప్పటికీ గుర్తుండి పోయేలాగా నటించారు.

'గమ్యం' సినిమాతో క్రిష్ రచయితగా, దర్శకుడిగా తన సత్తా చాటాడు. 'మోటార్‌సైకిల్ డైరీస్' వంటి చిత్రాల కథన శైలి నుంచి స్ఫూర్తి పొందిన క్రిష్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు నీతి, నిజాయితీ వంటి అంశాలను మేళవించి ఒక అద్భుతమైన స్క్రీన్‌ప్లేను రూపొందించాడు. గాలి శీను పాత్ర ద్వారా కామెడీని పండించడంతో పాటు, అభిరామ్ మంచిగా మారే మార్పును హృద్యంగా చూపించడంలో క్రిష్ సూపర్ సక్సెస్ అయ్యాడు. అక్కడే దర్శకుడిగా అతని గొప్పతనం ఏంటో తెలిసిపోయింది.

ఇక నాగరాజు గంధం రాసిన డైలాగులు చాలా గుర్తుండిపోయేలా ఉంటాయి. ముఖ్యంగా గాలి శీను పాత్రకు రాసిన హాస్య సంభాషణలు అద్భుతంగా పేలాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన లిరిక్స్ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంటుంది.

క్రిష్ తన మొదటి సినిమాతోనే ఇలాంటి కొత్త తరహా కథను ఎంచుకొని చాలా పెద్ద రిస్క్ చేశాడు అయినా మంచి మూవీ అందించాడు కాబట్టి అతన్ని అభినందించాల్సిందే. క్లైమాక్స్‌లో నక్సలైట్ల ద్వారా సామాజిక అంశాలను చర్చించే ప్రయత్నం చేశాడు, కానీ అది కొంచెం డైవర్టింగ్ గా అనిపించింది. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం. ఇన్నేళ్లయినా 'గమ్యం' సినిమా ఇప్పటికీ దర్శకులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. క్రిష్, అల్లరి నరేష్, శర్వానంద్ కెరీర్‌లలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: