బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇంటిలో గత వారం చొరబడిన ఓ వ్యక్తి సైఫ్ పై కత్తితో దాడి చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాంద్రాలోని ఆయన నివాసంలో దొంగతనానికి వచ్చిన ఆ వ్యక్తి సైఫ్ ను గాయపరిచి పారిపోయాడు. ఈ ఘటన బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. తాజాగా నిందితుడు మొహ్ద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ అని పోలీసులు గుర్తించారు. అతడి ఫింగర్ ప్రింట్స్ సైఫ్ ఇంటిలో చాలా చోట్ల కనిపించాయి. మెట్లపై, బాత్రూమ్ డోర్ దగ్గర, సైఫ్ కొడుకు జెహ్ రూమ్ డోర్ హ్యాండిల్ మీద కూడా షెహజాద్ వేలిముద్రలు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వాటిని కన్ఫర్మ్ చేసింది. అంటే దొంగతనం చేసింది షెహజాదే అని పోలీసులు పక్కాగా తేల్చారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, షెహజాద్ సైఫ్ ఇంటికి రాకముందు ఇంకో మూడు ఇళ్లల్లో కూడా దొంగతనానికి ప్రయత్నించాడంట. కానీ అక్కడ కుదరకపోవడంతో సైఫ్ ఇంట్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. దురదృష్టవశాత్తు సైఫ్ కు గాయాలయ్యాయి కానీ, పోలీసులు మాత్రం షెహజాద్ ను పట్టేసుకున్నారు.

ఈ కేసులో పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని వివిధ సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. షెహజాద్ నేరం చేశాడని చెప్పడానికి ఈ ఫింగర్ ప్రింట్లే మెయిన్ ఎవిడెన్స్ అని పోలీసులు బలంగా నమ్ముతున్నారు.

జనవరి 19న షెహజాద్ తన సొంత ఊరికి అంటే బంగ్లాదేశ్ కు పారిపోతుండగా థానేలోని హిరానందాని ఎస్టేట్‌లో పోలీసులు అతడిని చాకచక్యంగా అరెస్ట్ చేశారు. దాడి జరిగిన మూడు రోజులకే అతడు పోలీసులకు చిక్కాడు. ఆ తర్వాత బాంద్రా హాలిడే కోర్టు అతడికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. దీంతో పోలీసులు అతడిని తమదైన శైలిలో విచారిస్తున్నారు.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. షెహజాద్ లాయర్ సందీప్ షేఖనే పోలీసుల వాదనలను పూర్తిగా ఖండించారు. షెహజాద్ గత ఏడేళ్లుగా ముంబైలోనే ఉంటున్నాడని, అతడు బంగ్లాదేశీయుడు కాదని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు, పోలీసులు సరిగ్గా దర్యాప్తు చేయలేదని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న వ్యక్తి ముఖం షెహజాద్ ముఖంతో మ్యాచ్ అవ్వడం లేదని, పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని షేఖనే అంటున్నారు.

ఈ ఘటన తర్వాత సైఫ్ ఇంటి సెక్యూరిటీని బాగా పెంచారు. ఇద్దరు కానిస్టేబుళ్లను షిఫ్టుల వారీగా ఆయన ఇంటికి కాపలాగా పెట్టారు. అంతేకాదు, సీసీటీవీ కెమెరాలు, కిటికీలకు గ్రిల్స్ లాంటి అదనపు సెక్యూరిటీ చర్యలు కూడా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: