సైమన్ కౌవెల్ కు ఇంత పేరు, డబ్బు తెచ్చిపెట్టింది మాత్రం రియాలిటీ షోలే. 'ది ఎక్స్ ఫాక్టర్', 'బ్రిటన్స్ గాట్ టాలెంట్', 'అమెరికన్ ఐడల్', 'అమెరికాస్ గాట్ టాలెంట్' వంటి పాపులర్ షోలలో జడ్జిగా ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆయన ఇచ్చే ఫీడ్ బ్యాక్ సూటిగా, సుత్తి లేకుండా ఉంటుంది. కొందరికి నచ్చుతుంది, కొందరికి మంట పుట్టిస్తుంది. అందుకేనేమో సైమన్ జడ్జిగా కనిపిస్తే చాలు ఆ షోలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది.
అసలు విషయం ఏంటంటే సైమన్ కేవలం జడ్జి మాత్రమే కాదు, ఒక సక్సెస్ ఫుల్ మ్యూజిక్ ఎగ్జిక్యూటివ్, ప్రొడ్యూసర్ కూడా. 'సైకో ఎంటర్టైన్మెంట్' అనే ఒక పెద్ద కంపెనీకి ఆయనే యజమాని. ఈ కంపెనీ ద్వారా ఎంతోమంది మ్యూజిక్ ఆర్టిస్టులను మేనేజ్ చేస్తూ, టీవీ షోలను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. వన్ డైరెక్షన్, లిటిల్ మిక్స్, లియోనా లూయిస్, సుసాన్ బోయ్ల్ వంటి గ్లోబల్ స్టార్స్‌ను వెలుగులోకి తెచ్చింది కూడా సైమనే. వాళ్ల పాటలు, కచేరీలు, యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులో సైకో ఎంటర్టైన్మెంట్ కు కూడా వాటా అందుతుంది.
టాలెంట్ ను గుర్తించడంలో, హిట్ షోలను క్రియేట్ చేయడంలో సైమన్ తర్వాతే ఎవరైనా. అందుకే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆయన ఒక పెద్ద దిగ్గజంలా వెలుగొందుతున్నాడు. ఇది మాత్రమే కాదు, సైమన్ మంచి మనసున్న వ్యక్తి కూడా. చాలా చారిటీలకు విరాళాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలు, జంతువులు, హెల్త్ కేర్ కోసం పనిచేసే సంస్థలకు ఆయన భారీగా డొనేషన్స్ ఇస్తుంటారట. డబ్బులు బాగానే సంపాదించాడు కానీ సైమన్ ఇంకా టీవీల్లో, మ్యూజిక్ ఇండస్ట్రీలో యాక్టివ్ గానే పనిచేస్తూ ఉన్నాడు.