ఆకాష్ మురళి, అదితి శంకర్ (డైరెక్టర్ శంకర్ కుమార్తె) హీరో హీరోయిన్లుగా విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’ అనేపేరుతో తెలుగులోకి డబ్ చేసారు. ఈ సినిమా ఇటీవల సంక్రాంతికి ‘నేసిప్పాయా’ పేరుతో తమిళ్‌లో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేయగా ప్రస్తుతం ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ప్రేమిస్తావా’గా తీసుకొస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ‘ప్రేమిస్తావా’ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో జరిగిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు విష్ణు వర్ధన్.. మాట్లాడుతూ.. ‘‘దాదాపు ఏడెనిమిదేళ్ల తర్వాత తెలుగు వారిని ఇలా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ప్రస్తుతం సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయి అనే కోణంలో తెరకెక్కింది అని చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ గురించి మీడియా విలేకరులు మాట్లాడగా ఆయన మాట్లాడుతూ... ఆయనొక పవర్ హౌస్. నేను ఆయనతో వర్క్ చేసినప్పుడు అదే గమనించాను. ప్రతి విషయంలో ఆయన చాలా క్లారిటీగా ఉంటారు. ఇప్పుడాయన డిప్యూటీ సీఎం కాబట్టి త్వరలో ఆయన తనయుడు అకీరా సినిమాలలోకి వస్తే బావుంటుంది. మీలాగే నేను కూడా ఆయన ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఛాన్స్ నాకే వస్తే బావుంటుందని కూడా అనుకుంటున్నాను.. అంటూ స్పందించారు. దాంతో ఆ మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.