టాలీవుడ్‌లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ఎవరంటే ఠక్కున వినిపించే పేరు అనిల్ రావిపూడి. ఎందుకంటే, ఆయన కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టే. వరుసగా ఎనిమిది సినిమాలను హిట్ చేసి, ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు. దీంతో నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఈ క్రేజ్ కారణంగానే ఆయన తన రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారట.

ఇటీవల సంక్రాంతికి రిలీజైన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్ల వైపు దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ తో అనిల్ రావిపూడికి టాలీవుడ్‌లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఆయన తన తర్వాతి సినిమా కోసం ఏకంగా రూ.25 కోట్లు తీసుకుంటున్నారని టాక్. టాలీవుడ్‌లో రాజమౌళి, సుకుమార్ లాంటి కొద్దిమంది డైరెక్టర్లు మాత్రమే ఇంత భారీ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా వాళ్ల సరసన చేరిపోయారు.

"సంక్రాంతికి వస్తున్నాం" సినిమా కోసం అనిల్ రావిపూడి తీసుకున్న పారితోషికం చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే, ఈ సినిమాలో హీరోగా చేసిన వెంకటేష్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు అనిల్. వెంకటేష్ కు రూ.10 కోట్లు ఇస్తే, అనిల్ రావిపూడి ఏకంగా రూ.15 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనిల్. దీనికి సంబంధించిన కథా చర్చలు కూడా జరుగుతున్నాయట. చిరంజీవి కోసం అనిల్ ఎలాంటి కథను సిద్ధం చేస్తారో చూడాలి.

అనిల్ రావిపూడి కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. 2015లో "పటాస్" సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యారు. అంతకుముందు 2008 నుంచి రైటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసారు. "పటాస్" సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత 2016లో "సుప్రీమ్", 2017లో రవితేజతో "రాజా ది గ్రేట్", 2019లో వెంకటేష్, వరుణ్ తేజ్‌లతో "ఎఫ్2", 2020లో మహేష్ బాబుతో "సరిలేరు నీకెవ్వరు", 2022లో "ఎఫ్3", 2023లో "భగవంత్ కేసరి", 2025లో "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలు తీశారు.

అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్టే. ఇలా అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన ఏ సినిమా చేసినా అది బంగారంలా మారుతోందని అందరూ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: