టాలీవుడ్ దర్శకుడు బాబీ కొల్లి గురించి జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ సినిమాతో బాబీ సూపర్ డూపర్ హిట్ కొట్టి సత్తా చాటాడు. రెండేళ్ల కిందట ‘వాల్తేరు వీరయ్య’తో బాబీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా తాజాగా బాలయ్యతో డాకు సినిమా చేసి చాకు అనిపించుకున్నాడు. బాబీ కెరీర్లో ఒక్క ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తప్ప, మినహా అన్ని సినిమాలు సక్సెస్ ఫుల్ సినిమాలే అని చెప్పుకోవచ్చు. అయితే తెలుగు పరిశ్రమకి వరుస హిట్లిచ్చిన బాబీ ఈ స్థాయిలో ఉన్నాడుకానీ, ఒకప్పుడు సినీ రంగంలోకి అడుగు పెట్టినపుడు అందరిలాగా సినిమా కష్టాలు పడినవాడే.

అందులో సినిమాని తలపించిన బాబీ లవ్ స్టోరీ ఒకటి. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇబ్బంది పడుతున్న సమయంలోనే బాబీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని మీలో ఎంతమందికి తెలుసు? ప్రముఖ చెస్ ప్లేయర్ హారిక సోదరి అనూషను బాబీ ఘోస్ట్ రైటర్‌గా పనిచేస్తున్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి, తన భార్య గొప్పదనం గురించి బాబీ మాట్లాడగా ప్రస్తుతం అతని ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాబీ తన భార్య గురించి మాట్లాడుతూ... "నా పెళ్లి విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. నేను ఎలాంటి సినిమాలు తీస్తానో, ఏం చేస్తానో కూడా తను సీరియస్‌గా తీసుకోదు. స్కూల్ డేస్‌లోనే నేను తనను ప్రేమించాను. వాటర్ బాటిల్‌ షేర్ చేసుకోవడంతో మొదలైన మా స్నేహం ప్రేమగా మారింది. హైదరాబాద్ వచ్చాక తను ఇంజినీరింగ్ చదివింది. గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఆ తర్వాత వేలూరులో ఎంటెక్ చదివింది. అక్కడా గోల్డ్ మెడలిస్టే. కానీ తను అంత చదువరి అయినా.. ఏమీ లేని బాబీని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అందుకే తనంటే నాకు ప్రాణం. వాళ్లది పెద్ద ఫ్యామిలీ అయినప్పటికీ, అనూష నన్ను ప్రేమించిందని, ఎవరేమనుకున్నా పర్వాలేదని నాకిచ్చి పెళ్లి చేశారు వారి తల్లిదండ్రులు. అప్పటికి కూడా నేను స్టార్ డైరెక్టర్ కాదు. కనీసం రైటర్‌గా నాకు సోలో కార్డ్ కూడా పడలేదు. కానీ అందరూ నన్ను నమ్మారు. అది ఇప్పటికీ నా అదృష్టం అనిపిస్తుంది." అని చెప్పుకొచ్చాడు బాబీ.

మరింత సమాచారం తెలుసుకోండి: