• కుటుంబ అంగీకారం కోసం ఎదురుచూపు, మోహన్ బాబు ఆమోదం తర్వాత పెళ్లి.
• విరానికా అన్‌కండిషనల్ లవ్, బిజీ జీవితంలోనూ విష్ణు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.
విష్ణు మంచు, విరానికా.. టాలీవుడ్ లో ఈ జంట గురించి తెలియని వారుండరు. వీరిది సినిమా ప్రేమకథలా మొదలైన అందమైన బంధం. విష్ణు మొదటిసారి విరానికాను చూసిన క్షణం గురించి చెబుతూ.. “ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆగిపోయింది, కొన్ని క్షణాలు నేను ఊపిరి కూడా తీసుకోలేకపోయాను” అంటాడు. స్నేహితుడి పార్టీలో మొదటిసారి కలుసుకున్న వీరు, క్షణాల్లోనే ఒకరికొకరు కనెక్ట్ అయ్యారు. కేవలం పది రోజుల్లోనే తాము ఒకరికోసం ఒకరమనే నిర్ణయానికి వచ్చారట.
“ఆమె నా జీవితంలోకి రావాలని రాసిపెట్టి ఉంది” అని విష్ణు ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ విరానికా మాత్రం నటుడిని పెళ్లి చేసుకుంటానని కలలో కూడా అనుకోలేదట. “నేను ఆమె కలల రాకుమారుడికి పూర్తి వ్యతిరేకం. కానీ నా వ్యక్తిత్వం ఆమెకి నచ్చింది” అంటూ విష్ణు నవ్వుతూ చెప్పాడు.
సినిమాల్లో కనిపించే ప్రేమకథలానే వీరి లవ్ స్టోరీ ఉన్నా, పెళ్లి విషయంలో మాత్రం సంప్రదాయబద్ధంగా ఆలోచించారు. “మా ఇద్దరి తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. లేదంటే ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం” అని విష్ణు వెల్లడించాడు. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల అంగీకారం ఉండాలని ఆయన గట్టిగా నమ్ముతాడు.
విరానికా తల్లిదండ్రులు వెంటనే ఒప్పుకున్నారు. కానీ విష్ణుకి మాత్రం తండ్రి మోహన్ బాబుకు చెప్పాలంటే భయం వేసింది. అప్పటికే తల్లి, అక్క, తమ్ముడుకి ఈ విషయం తెలుసు, కానీ నాన్నకి చెప్పడానికి మాత్రం సంకోచించాడు. విష్ణు స్నేహితులు సునీల్, కళ్యాణ్ రామ్ కూడా మోహన్ బాబు రియాక్షన్ గురించి భయపడ్డారు. “సునీల్ అయితే నాతో, ‘నేను ఊర్లో లేనప్పుడు నాన్నకి చెప్పు’ అన్నాడు” అంటూ విష్ణు నవ్వేశాడు.
చివరికి అమెరికా వెళ్లే ముందు విష్ణు ధైర్యం చేసి నాన్నతో మాట్లాడాడు. “ఇది చాలా సీరియస్ విషయం. తర్వాత మాట్లాడుకుందాం” అని నాన్న అన్నాడు. కానీ విష్ణు తిరిగి వచ్చిన తర్వాత మోహన్ బాబు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఆ తర్వాత వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. టాప్ సెలబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు. నిజ జీవితంలో, సినిమాల్లో ప్రేమకు తేడా ఏంటి అని అడిగితే.. “నిజమైన ప్రేమను మాటల్లో చెప్పలేం” అని విష్ణు బదులిచ్చాడు. ఇలా వీరి ప్రేమ కథ 2009లో వివాహ బంధంతో ఒకటయ్యింది.
తమ ఏడో పెళ్లి రోజున విష్ణు విరానికా కోసం ఒక హార్ట్ ఫెల్ట్ మెసేజ్ పెట్టాడు. తన ప్రొఫెషన్ వల్ల తాను చాలామందితో ఫ్లర్ట్ చేస్తానని, ఒకసారి హీరోయిన్ హన్సిక కూడా తనతో “విని నిన్ను ఎలా భరిస్తుందో నాకు అర్థం కావట్లేదు!” అని అన్నట్లు చెప్పారు.
విష్ణు తన జీవితం చాలా బిజీగా ఉంటుందని చెబుతారు. యాక్టింగ్, ప్రొడక్షన్, బిజినెస్ లు అంటూ క్షణం తీరిక లేకుండా ఉంటాడు. చాలా ముఖ్యమైన ఈవెంట్స్ మిస్ అవుతాడు, డిన్నర్ డేట్స్ క్యాన్సిల్ చేసుకుంటాడు, ఇప్పటివరకు విరానికాను హనీమూన్‌కి కూడా తీసుకెళ్లలేదు. అయినా కూడా విరానికా తనని ప్రేమిస్తుంది.