అక్కినేని వారసుడు నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం తండేల్ విడుదల సమీపిస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రసార కార్యక్రమాలు షురూ చేసింది. ఈ సినిమాకి కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి డైరెక్టర్. బన్నీ వాస్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 07న విడుదల కానుంది. కాగా ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే నాగచైతన్య తండేల్ రాజ్‌ అనే మత్స్యకారుని పాత్రలో కనిపించనున్నాడు. మత్స్యకారుల నేపథ్యంలో కొన్ని యధార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.

కథ విషయానికొస్తే... కొందరు భారత జాలర్లు అనుకోకుండా పాక్‌ భూభాగంలోకి వెళ్లడం, పాక్ కోస్ట్ గార్డ్స్ వారిని అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించింది చిత్ర బృందం. కాగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రియల్ తండేల్ రాజ్(తండేల్ రామారావు) హాజరై అందరికీ ఆశ్చర్యపరిచారు. తన కుటుంబంతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను రామారావు చెప్పుకు రావడం జరిగింది.

ఈ సందర్భంగా పాకిస్తాన్ జైలులో ఎలాంటి కష్టాలు పడ్డారనే విషయాలను గుర్తు చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ... ‘తండేల్ అంటే లీడర్ అని అర్థం. మిగతా జాలరులు అందరూ ఆ తండేల్ ను అనుసరిస్తారు. ఎన్ని ఎక్కువ చేపలు పడితే అంత పేరు అతనికి వస్తుంది. వేటకు వెళ్లేముందు ఇదే లాస్ట్ ట్రిప్! అని నా భార్యకు చెప్పి వెళ్లాను. అప్పుడు ఆమె 7 నెలల గర్భిణి. 29 రోజులు సముద్రంలో వేట బాగానే సాగింది. అయితే వెనక్కి తిరిగి రావాలని అనుకున్నపుడు అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయాం. దీంతో పాకిస్తాన్ కోస్ట్ గార్డ్స్ అరెస్టు చేసారు. ఈ క్రమంలో అక్కడే దాదాపు 17 నెలలపాటు జైలులో మగ్గిపోయాం. అయితే ధైర్యంగా పోరాడాం కాబట్టే పాకిస్తాన్ జైలు నుంచి బయటకు వచ్చాం!’ అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు తండేల్ రామారావు.

మరింత సమాచారం తెలుసుకోండి: