సినిమాలతో పాటు బాలకృష్ణ రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్నారు. తండ్రి ఎన్టీఆర్ బాటలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచారు. అంతేకాదు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నారు.
ఈ ఏడాది బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో నాలుగో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది.
సినిమాలతోనే కాదు.. బాలకృష్ణ బుల్లితెరపై కూడా సక్సెస్ అయ్యారు. ఆహా ఓటీటీలో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' అనే టాక్ షోతో హోస్ట్‌గా అదరగొట్టారు. ఈ షోతో ఆహాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. సబ్‌స్క్రిప్షన్లు పెరిగాయి, వ్యూయర్‌షిప్ కూడా భారీగా పెరిగింది. అల్లు అరవింద్ ప్లాన్ చేసి బాలకృష్ణను హోస్ట్‌గా తీసుకురావడం నిజంగా సూపర్ హిట్ అయింది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు నాలుగో సీజన్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఇప్పుడు 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షోలో రాజమౌళితో బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ సినిమాల గురించి మాట్లాడుతూ.. 'అవతార్' సినిమా తనకు నచ్చలేదని బాలకృష్ణ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. జేమ్స్ కామెరూన్ 12 ఏళ్లు టైమ్ తీసుకుని సినిమా తీస్తే.. అలాంటి సినిమా వస్తే నేను లేచి వెళ్లిపోతానంటూ మొహం మీదే చెప్పేశారు. 'అవతార్' గొప్ప సినిమానే కానీ రాజమౌళి సినిమాల్లాగా ఒక అర్థం, పరమార్థం ఉండాలన్నారు. ఇది విన్న రాజమౌళి ఒక్కసారిగా షాక్ అయ్యి.. 'ఓహో, అలాగా' అంటూ రియాక్ట్ అయ్యారు.