గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్నాళ్ల క్రితం వరకు స్పీడుగా సినిమాలు చేసిన బ్రహ్మానందం ఈమధ్య కాలంలో మాత్రం సినిమాలను తక్కువగానే చేస్తున్నారు. సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి బ్రహ్మానందం 'ఆనందో బ్రహ్మ' అనే సినిమాలో నటించారు. ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గత సంవత్సరమే అనౌన్స్ చేశారు. బ్లాక్ బస్టర్ సినిమా 'మసూద' నిర్మాణ సంస్థ అయిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఈ క్రమంలోనే బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజా గౌతమ్‌లు కలిసి చేసిన ఓ ప్రోమోతో చిత్ర యూనిట్ ఓ వీడియోని రిలీజ్ చేయగా అనేక విషయాలు అందులో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో తండ్రి కొడుకులు తెరపై తాత, మనవడిగా కనిపించనుండటం విశేషం. ఈ ఏడాది డిసెంబర్ 6న ఈ చిత్రం రిలీజ్ కాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శాండిల్య పిసపాటి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ సందర్భంగా బ్రహ్మానందం కుమారుడు గౌతమ్సినిమా గురించి మాట్లాడుతూ... సినిమా కథ అద్భుతంగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విషయాలు దానిలో ఉంటాయని చాలా ధీమాని వ్యక్తం చేసాడు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ... నాన్న బ్రహ్మానందం అస్సలు సినిమాలే చూడరని, ఇక ఆయన సినిమాల ఆయన అస్సలు చూడరని చెప్పుకొచ్చారు. ఆయనకి తెలిసింది ఒక్కటే... సినిమాని చేయడం, వచ్చి రెస్ట్ తీసుకోవడం.. అంతకు మించి తన తండ్రిగారికి ఏమీ తెలియదని చెప్పుకొచ్చారు. అయితే అలాంటి ఆయన చేసిన సినిమాలను ప్రేక్షకులు ఇంతలా ఎలా ఆరాధిస్తున్నారో అని ఆయన ఆశ్చర్యపోతారని చెప్పుకొచ్చారు.

ఇక ఆయన కుమారుడు రాజా గౌతమ్ విషయానికొస్తే... ఆయన హీరోగా పలు సినిమాల్లో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే. పల్లకిలో పెళ్లికూతురు సినిమాతో గౌతమ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత బసంతి, మను అనే సినిమాల్లో నటించాడు. ఆ సినిమాల పెద్దగా ఆడకపోయినప్పటికీ గౌతమ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక బ్రహ్మానందం ఇటీవల తరుణ్ భాస్కర్ తీసిన కీడా కోలా చిత్రంలో నటించి మెప్పించిన సంగతి విదితమే. ఇందులో బ్రహ్మానందం తనదైన నటనతో కడుపుబ్బా నవ్వించారు. ఇక గతేడాది వచ్చిన 'రంగమార్తాండ' చిత్రంలో చక్రపాణి పాత్రలో బ్రహ్మానందం నటవిశ్వరూపం చూపించిన సంగతి విదితమే. ఆయన ఇన్నేళ్ల కెరీర్‌లో ఎప్పుడూ చేయనంత సీరియస్ పాత్రలో కనిపించగా ఆడియన్స్‌ ఎంతగా ఆ పాత్రని ఫీల్ అయ్యారో తెలియాల్సిన పనిలేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: