టాలీవుడ్ జక్కన్న ఎప్పుడైతే మహేశ్‌బాబుతో సినిమాని ప్రకటించాడో అప్పటి నుండి ఈ సినిమా అప్డేట్స్ కోసం జనాలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శక ధీరుడు రాజమౌళి నెలరోజులకొక అప్డేట్ బయటకి పంపిస్తూ మహేష్ హీరోగా నటిస్తున్న 29వ సినిమాపై అంచనాలను పెంచుకుంటూ పోతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే! ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌ తర్వాత జక్కన్న తీస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపైన ప్రపంచ వ్యాప్తంగా కూడా అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా ఓ ప్రధాన పాత్రలో ఇందులో కనిపించనున్నారు అనే విషయం బయటకు పొక్కిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. విషయం ఏమిటంటే? ఈ చిత్రంలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్‌ విలక్షణ నటుడు నానా పటేకర్‌ను సంప్రదించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై చిత్ర బృందం ఆయనతో సంప్రదింపులు కూడా చేసిందని, ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

ఇక ఇప్పటికే ఈ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం చిత్ర వర్గాలు పృథ్వీరాజ్‌ సుకుమార్‌తో చర్చలు జరిపాయని, ఆయన కూడా దీనిపై సముఖత తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక దీనిపై పృథ్వీరాజ్‌ ఇటీవలే స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో కొంతమంది సోషల్ మీడియా ఔత్సాహికులు కొన్ని హాలీవుడ్ మూవీలతో దీనిని కంపేర్ చేస్తూ... సినిమా అలా ఉంటుంది... ఇలా ఉంటుంది అనే అంచనాలు ఆల్రెడీ వేస్తున్నారు. మొత్తానికి ఇది ప్రపంచాన్ని చుట్టేసే అడ్వెంచక్‌ జర్నీగా ఉంటుందని వినికిడి. అయితే మరి ఈ సినిమాలో నానాపటేకర్‌ నటిస్తారా లేదా అన్న సంగతి తెలియడానికి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రానికి ఎప్పటిలాగే కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవరించగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించారు. దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై కె. ఎల్‌ నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సుమారు 450 కోట్ల బడ్జెట్ దీనికోసం కేటాయిస్తున్నట్టు భోగట్టా!

మరింత సమాచారం తెలుసుకోండి: