నాగచైతన్య-సాయిపల్లవి జంటగా తెరకెక్కిన 'తండేల్' నిన్న మొన్న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు ప్రేక్షకులే కాదు.క్రిటిక్స్ నుంచి కూడా సినిమాకు అభినందనలు దక్కుతున్నాయి. ఈక్రమంలో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చాలా రోజులకు తండేల్ వంటి అద్భుతమైన ప్రేమకథ చూశాను. నాగచైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించారు. చందూ మొండేటి తీసుకున్న కథ.. దాని నేపథ్యం సాహసోపేతమే. షాట్ మేకింగ్ పై దర్శకుడి శ్రద్ధ బాగుంది. ఈ చిత్రంతో విజయాన్ని అందుకున్న గీతా ఆర్ట్స్ కు అభినందనలు. ఒక్క మాటలో ఇది దర్శకుడి సినిమా అని అభిప్రాయాన్ని పంచుకున్నారు. నాగచైతన్య సంతోషం వ్యక్తం చేస్తూ థాంక్యూ సో మచ్ సర్మీకు సినిమా నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ మాటలు, అభినందనలు నాకెంతో అమూల్యమైనవ'ని అన్నారు. ప్రేక్షకుల నుంచి సినిమాకు అనూహ్య స్పందన రావడంతో టీమ్ సంతోషం వ్యక్తం చేస్తోంది.


ఇదిలావుండగా శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి చెందిన పలువురు వేటకు వెళ్లగా.. పాకిస్థాన్‌ కోస్ట్‌ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఘటన ఇతివృత్తంగా ఈ కథ సిద్ధమైంది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండేల్‌ రాజుగా చైతన్య, సత్యగా సాయి పల్లవి తమ నటనతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నారు. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో చైతన్య తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఎమోషన్‌కి గురి చేశారు. ఆయా సన్నివేశాలు కన్నీరు పెట్టించాయి. ఆ వీడియోలు నెట్టింట వైరల్‌ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ.21 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ పోస్టర్‌ విడుదల చేసి తెలిపింది.దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు అందించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాస్‌ దీనిని నిర్మించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: