దర్శక ధీరుడు రాజమౌళి పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమాలు తీయడంలో ఆయనకు మరెవరూ సాటి రారు. ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు సంచలన విజయాలతో దూసుకుపోతున్నాడు. రాజమౌళి పేరు చెబితే చాలు రికార్డులు బద్దలు కావాల్సిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్‌లను స్టార్ హీరోలుగా మార్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ముఖ్యంగా "బాహుబలి" సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆపై "ఆర్ఆర్ఆర్"తో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించాడు. అలాంటి డైరెక్టర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ హీరో, హీరోయిన్ కలలు కంటారు.

కానీ ఒక్క హీరో మాత్రం రాజమౌళినే డామినేట్ చేశాడు అంటే నమ్ముతారా.. ఆ హీరో ఎవరో కాదు.. మన మాస్ రాజా రవితేజ. రాజమౌళి, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన సినిమానే "విక్రమార్కుడు". ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సాధారణంగా రాజమౌళి సినిమాలో హీరోలు ఉంటారు.. కానీ ప్రశంసలు మాత్రం రాజమౌళికే దక్కుతాయి. ఆయన సినిమా అంటేనే ఒక బ్రాండ్. కానీ "విక్రమార్కుడు" మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. ఈ సినిమాలో రాజమౌళి దర్శకత్వం కన్నా రవితేజ యాక్టింగ్‌ గురించే అందరూ మాట్లాడుకున్నారు. నార్త్ జనాలు సైతం రవితేజ నటనకు ఫిదా అయిపోయారు.

"విక్రమార్కుడు" సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేశారు కానీ రవితేజలా నటించలేకపోయారని స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే చెప్పారు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించాడు. దొంగ అత్తిలి సత్తిగా, పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ రాథోడ్‌గా రెండు పాత్రల్లోనూ ఇరగదీశాడు. 2006లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో 54 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. సుమారు రూ.18.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.25 కోట్లకు పైగా వసూలు చేసింది. అనుష్క హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. మొత్తానికి "విక్రమార్కుడు" సినిమా రవితేజ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. రాజమౌళి సినిమాలో హీరో డామినేట్ చేయడం అంటే ఇదే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: