తమిళ నటుడు సూరి తెలుగు వారికి కూడా సుపరిచితుడు. దానికి కారణం 'విడుదలై' అనే సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తాజాగా విడుదలై పార్ట్ 2 గా రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదటి పార్ట్ 'విడుదల' తెలుగులో కూడా ఘనవిజయం సాధించింది. దాంతో సూరీ తెలుగువారికి బాగా పరిచయం అయ్యాడు. అంతకు మునుపు సూరి ఒక కమెడియన్ గా మాత్రమే జనాలకి తెలుసు. విడుదల సినిమాతో సూరిలో ఉన్న పరిపూర్ణమైన నటుడు జనాలకు పరిచయం అయ్యాడు. కట్ చేస్తే, తమిళంలో సూరి ఇపుడు బిజీ ఆర్టిస్టుగా మారాడు. ఇక సూరి పూర్తిపేరు "రామలక్ష్మణన్ ముత్తుసామి" అని చాలామందికి తెలియదు. సినిమాల్లోకి వచ్చాక అతని పేరు మారింది.

ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా వేదికగా మాట్లాడిన సూరి తన గతాన్ని నెమరు వేసుకున్నాడు. సూరి సినిమాల్లోకి రాకముందు హౌస్ పెయింటింగ్ పనికి వెళ్లేవాడట. సినిమాలమీద ఉన్న మక్కువతో మద్రాస్ చేరి ఆ దిశగా ప్రయత్నాలు చేయగా, ఎన్నో కష్టాల మధ్య సూరి ఈ స్థాయికి చేరుకున్నాడట. ఈ నేపథ్యంలో సూరి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వ్యక్తి హౌస్ పెయింటింగ్ చేసిన వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ... "నా గతం ఇదే. ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం మీ ప్రేమే!" అంటూ పోస్టు పెట్టాడు. దాంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇకపోతే "వెన్నెలా కబడి కుళు" అనే సినిమా ద్వారా ఓ చిన్న పాత్రలో తమిళ పరిశ్రమకి పరిచయమైన సూరి, ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా అలరించాడు. ఆ చిత్రంలో సూరి కామెడీ అందరినీ నవ్వించడంతో వరుసగా అవకాశాలు లభించాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హాస్యనటుడి స్థాయి నుండి హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలోనే ఆర్‌ఎస్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ పతాకంపై ఎల్‌ రెడ్‌ కుమార్‌ నిర్మించిన చిత్రంలో సూరి కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. అదే వెట్రిమాన్‌ దర్శకత్వంలో విడుదలై పేరుతో రూపొందిన సినిమా. ఈ సినిమా తరువాత ఈయనకు హీరోగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. మదయానై చిత్రం ఫేమ్‌ విక్రమ్‌ సుకుమార్‌, నటుడు సూరి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మరో చిత్రంలోనూ సూరి హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: