హీరో హీరోయిన్ల‌కు ఒక్క హిట్ పడితే చాలు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇంటి ముందు క్యూ క‌డ‌తారు. త‌మ సినిమాల్లో న‌టించాల‌ని రిక్వెస్ట్ చేస్తారు. త‌మ సినిమాలో న‌టిస్తే ముందే అడ్వాన్స్ ఇస్తామంటూ ఆఫ‌ర్స్ కూడా ఇస్తారు. అయితే హీరోయిన్ ఐశ్వ‌ర్య రాజేష్ విష‌యంలో అలా జ‌ర‌గ‌డ‌టం లేదట‌. టాలీవుడ్ లో సంక్రాంతికి విడుద‌లైన సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. ఈ చిత్రంలో వెంక‌టేష్ హీరోగా న‌టించ‌గా ఐశ్వ‌ర్య రాజేష్‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టించారు. మీనాక్షి చౌద‌రి వెంక‌టేష్ కు ఒకప్ప‌టి ప్రేయ‌సి పాత్ర‌లో క‌నిపించ‌గా ఐశ్వ‌ర్య రాజేష్ భార్య పాత్ర‌లో న‌టించింది. 

ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య తన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అందం అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. కామెడీతో పాటూ ఎమోష‌న్స్ ను కూడా బ్యాలెన్స్ చేస్తూ మెప్పించింది. అయితే ఈ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించినా ఆమెకు ఆఫ‌ర్లు రాక‌పోవడం ఆశ్చ‌ర్య‌క‌రం. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఐశ్వ‌ర్య‌నే ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. సంక్రాంతికి వ‌స్తున్నాం పెద్ద హిట్ట‌యినా త‌న‌కు తెలుగు నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క సినిమా ఆఫ‌ర్ కూడా రాలేద‌ని చెప్పింది. త‌న‌కు అవకాశాలు ఇవ్వ‌డానికి తెలుగువారికి స‌మ‌యం కావాలేమో అంటూ వ్యాఖ్యానించింది.

తాను టిపిక‌ల్ క‌మ‌ర్షియ‌ల్ టైప్ హీరోయిన్ కాద‌ని అందువ‌ల్లే అవ‌కాశాలు రావ‌డం లేద‌నుకుంటాన‌ని చెప్పింది. సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమా షూటింగ్ ప్ర‌మోష‌న్స్ కారణంగా కొన్ని త‌మిళ సినిమా ఆఫ‌ర్స్ వ‌చ్చినా కూడా వ‌దులుకున్నానని తెలిపింది. తెలుగులో మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని ఉంద‌ని కానీ అవ‌కాశాల కోసం ఎవ‌రిని అడ‌గ‌లేద‌ని పేర్కొంది. అలా అడ‌గ‌టం కూడా త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని వ‌చ్చిన ఆఫ‌ర్లు చేసుకుంటూ వెళ్లిపోతాన‌ని చెప్పింది. ఇదిలా ఉంటే తెలుగులో ఐశ్వ‌ర్య రాజేష్ గ‌తంలో కొన్ని సినిమాలు చేసినా ఆశించిన‌మేర హిట్ ప‌డ‌లేదు. ఇప్పుడు హిట్ కొట్టినా అవ‌కాశాలు ద‌క్క‌డంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: