
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ ఇండస్ట్రీలో అదేవిధంగా యూత్ లో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న ఈమె నటించిన ‘గార్గి’ మూవీకి జాతీయ అవార్డు వస్తుందని అంచనాలు వచ్చాయి. అయితే ఫలితం వేరుగా ఉండటంతో ఆమె అభిమానులతో పాటు సాయి పల్లవి కూడ కొంతవరకు నిరాశకు లోనైంది అని అంటారు. అయితే ఏదో ఒక సంవత్సరం తనకు జాతీయ అవార్డు వచ్చి తీరుతుందని ఆమె చాల నమ్మకంతో ఉన్నట్లుగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.
ఇలా ఆమె కోరుకోవడం వెనుక ఒక బలమైన కారణం కూడ ఉంది. ఈవిషయాన్ని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. తనకు 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన బామ్మ తనకు ఒక చీర కొని ఇచ్చి తాను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ చీరను కట్టుకోమని చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అయితే అప్పటికి తాను సినిమాలలోకి రాలేదని అనుకోకుండా ‘ప్రేమమ్’ మూవీలో నటించడం ఆతరువాత నటిగా బిజీ అవ్వడంతో తన బామ్మ కోరిక తాను ఇప్పటివరకు నెరవేర్చలేకపోయిన విషయాన్ని వెల్లడించింది.
అయితే నటిగా తనకు మంచి పేరు వస్తోంది కాబట్టి ఏదో ఒకరోజు తనకు జాతీయ అవార్డు వచ్చినప్పుడు ఆ అవార్డు ఫంక్షన్ కు తాను ఆ చీరను కట్టుకుని వెళ్ళి తన బామ్మ కోరికను మరొక విధంగా తీర్చాలని నిశ్చయించుకున్న విషయాన్ని తెలియచేసింది. అంతవరకు ఆ చీరకు సంబంధించిన ఒత్తిడి తన పై ఉంటుంది అంటూ జోక్ చేసింది. ఇంతకీ సాయి పల్లవి కోరిక తీరాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు..