
ఒకప్పుడు తెలుగు సినీ రంగంలో 50 రోజులు .. 100 రోజులు .. 150 రోజులు .. 175 రోజులు 200 .. 365 అంటూ రికార్డుల తో ఉండేవి. ఒక హీరో సినిమా ఎన్ని సెంటర్లలో ఎన్ని రోజులు ఆడింది అన్నదే సినిమా హిట్ అని చెప్పేందుకు కొలమానంగా ఉండేది. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అంతా ఎన్ని థియేటర్లు... ఫస్ట్ డే కలెక్షన్ ఎంత .. టోటల్ కలెక్షన్ ఎంత.. గ్రాస్ .. నెట్ .. షేర్ అంటూ కొత్త లెక్కలు వచ్చేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు హిట్ సినిమా నెల రోజులు థియేటర్లలో ఉండడం గగనం అవుతోంది. ఒకప్పుడు ప్లాప్ సినిమా లు కూడా కొన్ని సెంటర్లలో 100 రోజులు ఆడేవి.
అప్పట్లో ప్లాప్ సినిమా లకు కూడా లాంగ్ రన్ ఉండేది. థియేటర్లలో ప్రేక్షకులు ఆ సినిమాలను చూసి ఎంజాయ్ చేసేవారు. సినిమా కొన్ని సెంటర్లలో జనాలకు ఎక్కక పోయినా .. కొన్ని సెంటర్లకు బాగానే కనెక్ట్ అయ్యేది. అప్పట్లో ప్లాప్ టాక్ తో కూడా 100 రోజులు ఆడిన సినిమాలు ఏవో చూద్దాం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన మున్నా సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తొమ్మిది సెంటర్లలో 100 రోజులు ఆడింది. అప్పట్లో ఇదో రికార్డు అని చెప్పాలి.
ఇక మహేష్ బాబు - మురుగదాస్ డిజాస్టర్ స్పైడర్ మూవీ కూడా నెల్లూరులోని రామరాజు థియేటర్లో 100 రోజులు ఆడి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక మహేష్ బాబు - సుకుమార్ వన్ సినిమా ప్లాప్ అయినా అనంతపురం జిల్లా రాయదుర్గంలో 100 రోజులు ఆడింది. చిరంజీవి నటించిన అంజి హిట్ కాలేక పోయినప్పటికీ వందరోజుల పాటు ఆడింది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఖలేజా ప్లాప్ అయినా కూడా కొన్ని చోట్ల 100 రోజులు ఆడింది.