ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ రాష్ట్ర ప్రజలకు మేలు చేకూరేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఫ్రీగా ఆరోగ్య బీమా వర్తించే దిశగా బాబు సర్కార్ అడుగులు పడుతున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించి ఉన్నత స్థాయిలో సమీక్ష జరగనుండగా ఆ సమావేశంలో అధికారిక నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.
 
శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు ఒక యూనిట్ గా గుంటూరు నుంచి రాయలసీమ జిల్లాల వరకు మరో యూనిట్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ విధానంలో భాగంగా ఏడాదికి 25 లక్షల రూపాయల వరకు ఫ్రీగా వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త బీమా విధానంలో వార్షిక పరిమితి, ఇతర కండీషన్లతో సంబంధం లేకుండా ఏడాదికి 2.5 లక్షల రూపాయల ఉచిత వైద్య సేవలు అందనున్నాయి.
 
2.5 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చైతే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించడం జరుగుతుంది. ఏప్రిల్ లేదా మే నెల నుంచి ఈ బీమా విధానం అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉన్న కుటుంబాలు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందనున్నాయి. ప్రీమియం చెల్లించే వాళ్లను మినహాయించి మిగిలిన వాళ్లకు బీమా విధానాన్ని వర్తింపజేయడానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
 
ఎంపిక చేసిన బీమా కంపెనీ మూడేళ్ల పాటు సర్వీస్ అందించాల్సి ఉండగా ప్రతి సంవత్సరం పనితీరును సమీక్షిస్తారని తెలుస్తోంది. కుటుంబం తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం 2500 రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయన ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులను తీసుకుని పరిశీలించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: