వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా గత నెలలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కేవలం తెలుగులో మాత్రమే విడుదల అయినా కూడా ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు దక్కాయి. తెలుగు సినీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక లాభాలను తెచ్చి పెట్టిన రీజినల్‌ మూవీగా నిలిచింది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాకుండా వంద కోట్లకు మించి షేర్‌ రాబట్టిన సినిమాగా కూడా ఈ సినిమా నిలిచిన విషయం తెల్సిందే. ఈ సినిమా థియేట్రికల్‌ రిలీజ్ అయి నాలుగు వారాలు దాటింది.ఇదిలావుండగా పాన్ ఇండియన్ సినిమాలతో బొత్తిగా మన నేటివిటీ కి తగ్గ సినిమాలను చూసి చాలా కాలం అయ్యింది అని ఫ్యామిలీ ఆడియన్స్ అనుకుంటున్న సమయంలో ఈ సినిమా విడుదల అవ్వడంతో బయ్యర్స్ పండగ చేసుకున్నారు. ఎక్కడ చూసినా థియేటర్స్ నెల రోజుల పాటు కిటకిటలాడాయి. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కానీ ఈ చిత్రం ఓటీటీ లో కంటే ముందుగా టీవీ టెలికాస్ట్ కాబోతుంది. జీ గ్రూప్స్ సంస్థ ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ రైట్స్ తో పాటు, సాటిలైట్ రైట్స్ ని కూడా కొనుగోలు చేసింది. అయితే ఈమధ్య కాలం లో జీ తెలుగు సాటిలైట్ బిజినెస్ బాగా డౌన్ అయ్యింది. బ్లాక్ బస్టర్ సీరియల్స్ కరువయ్యాయి. థియేటర్స్ లో దుమ్ములేపిన సినిమాలు కూడా జీ తెలుగు లో మిశ్రమ స్పందన దక్కించుకున్నాయి. ‘కల్కి’, ‘సరిపోదా శనివారం’ చిత్రాలు అందుకు ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ సినిమాలు ఓటీటీ లో విడుదలైన చాలా రోజులకు టీవీ టెలికాస్ట్ అయ్యాయి. అందుకే టీఆర్ఫీ రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. ఇది గమనించిన జీ సంస్థ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసే ముందు టీవీ టెలికాస్ట్ చేస్తే కచ్చితంగా భారీ రేటింగ్స్ వస్తాయని భావించింది.

అందుకే ఈ సినిమాని మార్చి 1వ తారీఖున సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాకి మొదటి టెలికాస్ట్ లో జీ తెలుగు టీం 20 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ రావాలని టార్గెట్ పెట్టుకున్నారు. ‘వకీల్ సాబ్’ చిత్రానికి మొదటి టెలికాస్ట్ లో 19 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. కరోనా లాక్ డౌన్ తర్వాత ఈ చిత్రానికే అత్యధిక రేటింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత విడుదలైన సినిమాలన్నీ ఆ రేంజ్ ని అందుకోలేకపోయాయి. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఆ రేంజ్ రేటింగ్స్ ని రాబడుతుందని బలమైన నమ్మకం తో ఉంది జీ గ్రూప్స్ టీం. అందుకు సంబంధించిన ప్రొమోషన్స్ కూడా దుమ్ము లేపనున్నారు. చూడాలి మరి జీ తెలుగు ఛానల్ ఈ చిత్రం తో రేటింగ్స్ విషయంలో కం బ్యాక్ ఇస్తుందా లేదా అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: