
మహాభారతంలో చాలా గొప్ప ఎపిసోడ్లు ఉన్నాయి. గొప్ప గొప్ప పాత్రలున్నాయి. అయితే లింగు స్వామి మాత్రం అర్జునుడు – అభిమన్యుడు పాత్రలు, వాటి నేపథ్యంలో ఈ కథని తెరకెక్కిస్తున్నాడని తెలుస్తోంది. అర్జునుడు, అభిమన్యుడిగా ఎవరు కనిపిస్తారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. లింగుస్వామికి ఈ రెండు పాత్రల కోసం ఇద్దరు స్టార్ హీరోలు కావాలి. తమిళం నుంచి ఒకర్ని, తెలుగు నుంచి మరొకర్ని తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. అయితే లింగు స్వామి ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. గత చిత్రాలు బాగా ఇబ్బంది పెట్టాయి. పైగా మైథాలజీ హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. భారీ బడ్జెట్ చిత్రాలు, వీఎఫ్ఎక్స్ కి పెద్ద పీట వేసిన కథల్ని తమిళ దర్శకులు సరిగా తెరకెక్కించలేకపోతున్నారు. పైగా లింగు స్వామిని నమ్మి రూ.700 కోట్లు పెట్టే నిర్మాతలు ఉన్నారా? అనేది పెద్ద అనుమానం. కాకపోతే… తమిళ నాట మాత్రం ఈ ప్రాజెక్ట్ గురించి విస్త్రృతమైన ప్రచారం సాగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, త్వరలోనే లింగుస్వామి పూర్తి వివరాలు వెల్లడిస్తారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నెటిజన్లు మాత్రం ‘మహాభారత్’ తీసే సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి మాత్రమే అని, మిగిలిన వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఆయన స్థాయిలో కథని తెరకెక్కించలేని కామెంట్లు విసురుతున్నారు.