
ఇళయరాజా రెండుసార్లు హైదరాబాద్ లో భారీ స్థాయిలో కచేరీ చేసిన విషయం తెలిసిందే. ఇదే మార్గాన్ని ఎంచుకుని దేవిశ్రీ ప్రసాద్ గత అక్టోబర్ లో నిర్వహించిన సంగీత కచేరీ కూడ బాగా హిట్ అయింది. అయితే ఈ ట్రెండ్ తమిళనాడులో చాల ఎక్కువగా ఉంటోంది. హరీస్ జైరాజ్ దేవా యువన్ శంకర్ రాజా ఇలా చాలామంది సంగీత దర్శకులు సంగీత ప్రదర్శనలు ఇచ్చి కోట్ల రూపాయాలలో ఆదాయం గణిస్తున్నారు.
ఇప్పుడు ఈ మార్గాన్ని కీరవాణి కూడ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. వచ్చే నెల మార్చి 22 ఆస్కార్ విజేత ఎమ్ ఎమ్ కీరవాణి హైదరాబాద్ లో మై టూర్ ఎంఎంకె పేరుతో లైవ్ కన్సర్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన టికెట్ల అమ్మకాలు ఆన్ లైన్ లో మొదలయ్యాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర సహాయకుడుగా పనిచేసి ఆతరువాత 1990 ప్రాంతం నుండి అంచలంచలుగా ఎదిగిన కీరవాణి పేరు వినగానే ‘అన్నమయ్య’ ‘శ్రీరామదాసు’ ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలలోని పాటలు గుర్తుకు వచ్చి తీరుతాయి.
ఆయన ట్యూన్ చేసిన కొన్ని వందల పాటలు ఇప్పటికీ ఎక్కడ ప్రదర్శన చేసినా జనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. 65 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఇప్పటికీ యంగ్ డైరెక్టర్స్ కు పోటీ ఇస్తూ కీరవాణి కంపోజ్ చేసే పాటలు ఆసినిమాల ఘన విజయానికి సహాయపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. సుమారు 100 మందికి పైగా ఉండే ఈ ఆర్కెస్ట్రా గ్రూప్ తో కీరవాణి అమెరికా ఆస్ట్రేలియాలో కూడ ఈ ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు అన్నట్లు వార్తలు వస్తున్నాయి..