మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో దాదాపు 300 మంది ప్రజలు, అందులో ఎక్కువగా యువతులు, విద్యార్థులు ఒక్కసారిగా జుట్టు ఊడిపోవడం, బట్టతల రావడం చూసి షాక్ తిన్నారు. అసలు కారణం ఏంటో తెలుసా? కల్తీ గోధుమలు. రోజులు గడుస్తున్నా కొద్దీ జుట్టు రాలిపోవడం ఎక్కువ కావడంతో దాదాపు 15 గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు.

వెంటనే డాక్టర్లు, అధికారులు రంగంలోకి దిగారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ హిమ్మత్‌రావు బావస్కర్‌ స్వయంగా ఈ విషయంపై దర్యాప్తు చేశారు. ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా సరఫరా చేసిన గోధుమల్లో ప్రమాదకర స్థాయిల్లో సెలీనియం అనే ఖనిజం ఉందని ఆయన కనుగొన్నారు. సెలీనియం అనేది మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరమయ్యే ఖనిజం. ఇది మన కణాల నష్టాన్ని నివారించడానికి, థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

కానీ ఇదే సెలీనియం మోతాదు ఎక్కువైతే మాత్రం సెలీనోసిస్ అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల జుట్టు రాలడం, గోళ్లు పెళుసుబారడం, చర్మ సమస్యలు, కడుపు నొప్పి, అంతేకాదు నరాల బలహీనత కూడా వస్తాయి జాగ్రత్త.

గోధుమ నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. గోధుమల్లో సెలీనియం సురక్షిత స్థాయి 1.9 mg/kg మాత్రమే. కానీ కల్తీ గోధుమల్లో మాత్రం ఏకంగా 14.52 mg/kg ఉంది. అంతేకాదు, కడిగిన గోధుమల్లో కూడా 13.61 mg/kg సెలీనియం ఉంది. అంటే సురక్షిత స్థాయి కంటే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ.

ఈ గోధుమలు పంజాబ్ నుంచి వచ్చాయని తేలింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్, నవాన్‌షహర్ జిల్లాల్లో 2000ల ప్రారంభంలో ఇలాంటి సెలీనియం కల్తీ కేసులు నమోదయ్యాయి. దీనికి కారణం అక్కడి నేలల్లో సెలీనియం స్థాయిలు ఎక్కువగా ఉండటమేనని భావిస్తున్నారు.

జుట్టు రాలిన చాలా మందిలో జింక్ స్థాయిలు కూడా తక్కువగా ఉన్నాయని వైద్యులు గుర్తించారు. జింక్ కూడా జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి చాలా అవసరం. జింక్ తక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడం మరింత ఎక్కువైంది.

ప్రభుత్వం గోధుమలను పంపిణీ చేసే ముందు సెలీనియం పరీక్షలు తప్పనిసరిగా చేయాలి. ప్రజలు కూడా గోధుమలను శుభ్రంగా కడుక్కోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. అప్పుడే ఇలాంటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: