ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అయినట్టు, యాక్టర్ కొడుకు యాక్టర్ అయినపుడు డ్యాన్స్ మాస్టర్ కొడుకు కూడా డాన్స్ మాస్టర్ కావాలని అనుకోవడంలో తప్పు లేదు. అవును, సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్ గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రభుదేవా గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన డ్యాన్స్ స్టెప్స్ తో స్టార్ హీరోలను సైతం మెప్పించి చిన్న ఏజ్ లోనే ప్రభుదేవా స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు. ప్రభుదేవా కూడా ఓ డాన్స్ మాస్టర్ కొడుకునే విషయం అందరికీ తెలిసిందే. ప్రభుదేవా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినీ పరిశ్రమలో పనిచేశాడు. అభిమానులు ఇతన్ని ఇండియన్ మైఖేల్ జాక్సన్ అని పిలుచుకుంటారు.

తండ్రి సుందరం మాస్టర్ స్ఫూర్తితో నాట్యంపై ఆసక్తి పెంచుకున్న ప్రభుదేవా టీనేజీ వయసు నుంచే నృత్య దర్శకత్వం మొదలు పెట్టాడు. ప్రభు సోదరులు రాజు సుందరం, నాగేంద్ర ప్రసాద్ కూడా నృత్య కళాకారులే అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుదేవా ఓ పక్క డ్యాన్స్ మాస్టర్ గా పనిచేస్తూనే మరో పక్క హీరోగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ప్రభుదేవా తన వారసుడు "రిషి దేవా"ను పరిచయం చేసాడు. ప్రభుదేవ మొదటి భార్య లతాకు ముగ్గురు పిల్లలు ఉండగా ఒకరు క్యాన్సర్ తో చనిపోయారు. రెండవ భార్య హిమానితో ఒక కూతురు ఉంది. ప్రభుదేవ – లతా కుమారుడే రిషి దేవా. తాజాగా ప్రభుదేవా తన కొడుకుని గ్రాండ్ గా అందరికి ఇంట్రడ్యూస్ చేసాడు.

తాజాగా చెన్నైలో ప్రభుదేవా మొదటిసారిగా డ్యాన్స్ లైవ్ కాన్సర్ట్ వైబ్ అనే పేరుతో ఏర్పాటు చేసి, కొన్ని గంటల పాటు రకరకాల సాంగ్స్ కు ప్రభుదేవా, అతని టీమ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఈవెంట్లో ప్రభుదేవా తన కొడుకు రిషి దేవాతో కలిసి డ్యాన్స్ చేసి అందరికి పరిచయం చేసాడు. ఈ ఈవెంట్లో తండ్రి – కొడుకులు చేసిన డ్యాన్స్ ని ప్రభుదేవా తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. నా కొడుకు రిషి దేవాని పరిచయం చేస్తున్నందుకు గర్వపడుతున్నాను అని పేర్కొనడం గమనార్హం. వారసత్వం, ప్యాషన్ తో ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని రాసుకొచ్చారు. దీంతో ప్రభుదేవా కొడుకు రిషి దేవా కుడా డ్యాన్స్ లోకే వచ్చాడని, త్వరలోనే డ్యాన్స్ మాస్టర్ అవుతాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: