'కన్నప్ప' సినిమా గురించి వినే ఉంటారంటే? ఎందుకు వినలేదు.. రోజూ సోషల్ మీడియాలో చూస్తున్నాంగా ట్రోల్స్ మీద ట్రోల్స్ అంటారా? అవును.. 'కన్నప్ప' సినిమాని ఎప్పుడైతే మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్రకటించాడో ఇక అక్కడినుండి ఈ సినిమాపైన కొందరు దాడి చేయడం మొదలు పెట్టారు. సినిమా ఫలితం ఎలాగున్నా, విడుదలకు ముందే కొందరు ట్రోల్స్ చేస్తూ 'కన్నప్ప' సినిమాకి కావలసినంత పబ్లిసిటీ తెస్తున్నారు. ఇక మరికొన్ని రోజులలో ఈ సినిమా విడుదల కావడంతో చిత్ర యూనిట్ ప్రసార కార్యక్రమాలు షురూ చేసింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో జరిగిన ప్రత్యేక మీడియా ఈవెంట్‌లో ‘కన్నప్ప’ టీజర్‌ను ఆవిష్కరించారు.

సదరు వేదికపై బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, మంచు విష్ణు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, మోహన్ బాబు సందడి చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించిన ఈ 'కన్నప్ప' టీజర్ అందరినీ ఆకట్టుకుంది. దాంతో అక్కడి మీడియా ప్రతినిధులు 'కన్నప్ప' టీజర్ పైన ప్రశంసల జల్లు కురిపించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా తెరకెక్కింది. శివుడి పాత్రలో నటించిన అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.

అక్షయ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... "'కన్నప్ప' ఆఫర్ నా వద్దకు రెండు సార్లు రాగా రెండు సార్లు తిరస్కరించాను. కానీ భారతీయ సినిమా ప్రపంచంలో శివుడిగా నేను బాగుంటాను అని విష్ణు పెట్టుకున్న నమ్మకమే నన్ను ఈ సినిమా చేసేలా చేసింది. 'కన్నప్ప' కథ చాలా శక్తివంతమైంది. ఎంతో లోతైన ఎమోషన్స్ ఇందులో దాగివున్నాయి. విజువల్ వండర్‌గా అందరికీ తప్పక మెప్పిస్తుంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను!" అని అన్నారు. ఆ తరువాత మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘కన్నప్ప' కేవలం నాకు ఓ ప్రాజెక్ట్.. ఓ సినిమా మాత్రమే కాదు.. ఇది నా జీవిత ప్రయాణం. నేను ప్రస్తుతం భారతదేశంలోని అన్ని జ్యోతిర్లింగాలను సందర్శిస్తున్నాను. 'కన్నప్ప' కథతో నాకు ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది అంటూ ప్రసంగం ముగించాడు. కాగా ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ దృష్టిని ఆకర్షించిన ఈ 'కన్నప్ప' టీజర్,  మార్చి 1న అందరి ముందుకు రాబోతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది"అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: