ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో విడదీయరాని బంధం ఉంది. తొలి చిత్రం 'గంగోత్రి' తర్వాత అల్లు అర్జున్ తో 'ఆర్య'  మూవీని నిర్మించి మంచి విజయాన్ని కట్టబెట్టాడు దిల్ రాజు. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో 'పరుగు, ఎవడు, డి.జె. దువ్వాడ జగన్నాథమ్' చిత్రాలను బన్నీ చేశాడు. అప్పట్లోనే అల్లు అర్జున్ హీరోగా 'ఐకాన్  కనబడుట లేదు' అనే సినిమా నిర్మించబోతున్నట్టు దిల్ రాజు ప్రకటించాడు. దానిని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తారనీ అన్నారు. కానీ ఎందుకో అది మాత్రం పట్టాలెక్కలేదు. ఇటీవల విడుదలైన 'పుష్ప-2' తో బన్నీ ఇమేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 1871 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అల్లు అర్జున్ తదుపరి చిత్రాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపాడని తెలుస్తోంది. ఇది 'ఐకాన్' మూవీనేనా లేకపోతే వేరే కథను తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. అసలు ఇప్పుడున్న కమిట్ మెంట్స్ మధ్యలో దిల్ రాజుకు బన్నీ డేట్స్ ఇవ్వడమే పెద్ద విషయం అనీ అంటున్నారు. ఈ యేడాది దిల్ రాజు నిర్మించిన రెండు సినిమాలు 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' విడుదల కాగా, మొదటి సినిమా నిర్మాతగా దిల్ రాజుకు చుక్కులు చూపించింది. రెండో సినిమా ఘన విజయం సాధించి, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ కు కొత్త ఊపిరిలూదింది.

ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్.దిల్ రాజుకు డేట్స్ ఇవ్వడమంటే గ్రేట్ అని సినిమా వర్గాలు చెప్పుకుంటున్నాయి.అయితే దీనికి కారణం లేకపోలేదు అదేమిటంటే దిల్ రాజు కి మాత్రమే ఎందుకు ఆయన అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడంటే.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అంశంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వానికి, అల్లు ఫ్యామిలీ కి మధ్య వారధిగా నిల్చి, ఆ సమస్య ముదరకుండా సామరస్యంగా పరిష్కరించుకోవడం లో సహాయపడ్డాడు. అందుకే దిల్ రాజు పై అల్లు అర్జున్ ఎంతో ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నాడు. ఆయన చూపించిన ఈ చొరవకు కృతజ్ఞతగా ఒక సినిమా చేసి పెడతానని మాట ఇచ్చాడట. ఇదిలా ఉంటే... 'పుష్ప-2' రేంజ్ మామూలుగా లేదనే విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది. అమెరికన్ పాపులర్ షో 'ఎన్.బి.ఎ.' గేమ్ లో ఛీర్ లీడర్స్ ఏకంగా 'పుష్ప -2'లోని వస్తున్నాయ్ పీలింగ్స్ పాటకు స్టె్ప్పులేసి అలరించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇండియన్ సినిమా ఒకటి గ్లోబల్ స్టేజ్ లో ఏ పొజిషన్ కు చేరుకుందో చెప్పడనికి ఇదో గొప్ప ఉదాహరణ. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేసినా అది సంచలనం అవుతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: