ప‌రిచ‌యం :
ప్రముఖ కోలీవుడ్ సంగీత దర్శకుడు హీరో జీవి ప్రకాష్ కుమార్ నటించిన సినిమా కింగ్‌స్ట‌న్. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమాలో దివ్యభారతి హీరోయిన్.. జీవి ప్రకాష్ సొంత నిర్మాణంలో కమల ప్రకాష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తమిళంలో తెర‌కెక్కిన కింగ్‌స్ట‌న్ సినిమా డబ్బింగ్ తో తెలుగులో నేడు రిలీజ్ అయింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది ఏంటో స‌మీక్ష‌లో తెలుసుకుందాం.


క‌థ :
1982లో సముద్ర తీరంలోని ఓ గ్రామంలో బోసయ్య ( అజగన్‌ పెరుమాళ్ ) అనే వ్యక్తిని ఊరంతా కలిసి చంపేస్తారు. బోసయ్య ఆత్మ అయ్యి గ్రామస్తులను భయపెడుతూ ఉంటాడు.. దీంతో ఆ శ‌వాన్ని సముద్రంలో పడేస్తారు.. సముద్రంలోకి ఎవరు వెళ్లినా శవాలుగా తిరిగొస్తూ ఉండటంతో ఆ ప్రాంతంలో చేపల వేటకు వెళ్ళద్దని ఆ ఊరు చుట్టూ సముద్రానికి కంచి వేస్తారు. ఆ ఊరి వాళ్లకు పని పోవడంతో అక్కడి నుంచి వెళ్లి మరో సముద్రం ఉన్న సిటీలో సెటిల్ అవుతారు. ఆ సిటీలో థామస్ (సాబుమాన్ అబ్దు సమద్) అనే రౌడీ వాళ్లకు పని ఇస్తాడు. తాజాగా 2025 లో కింగ్ స్ట‌న్ ( జీవి ప్రకాష్ కుమార్ ) థామస్ వ‌ద్ద‌ డబ్బు కోసం పనిచేస్తూ ఉంటాడు. థామ‌స్ చెప్పినట్టు సముద్రంలోకి వెళ్లి శ్రీలంక బోర్డర్లో అక్రమంగా ఏదో తరలిస్తూ ఉంటారు కింగ్ స్ట‌న్‌ అతని స్నేహితులు. ఒకరోజు సముద్రంలో నేవీ అధికారులు వాళ్లపై అటాక్ చేయడంతో ఒక పిల్లాడు చనిపోతాడు. దీంతో థామస్ వాళ్ళతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని తెలిసి కింగ్ స్ట‌న్ అతడికి ఎదురు తిరుగుతాడు.


ఈ క్రమంలోనే తన ఊరు వాళ్ళు ఎవరు థామస్ దగ్గర పనికిరారు అని అల్టిమేటం జారీ చేస్తాడు. ఊర్లో మూసేసిన సముద్రంలోకి వేటకు వెళ్లి చాపలు పట్టుకుని వ‌స్తే ఊరివాళ్లు ఆత్మలు.. దయ్యాలు లేవని నమ్ముతారని కింగ్‌స్ట‌న్ అతడి స్నేహితులు థామస్ ని కూడా తీసుకుని మూసేసిన సముద్రంలోకి వెళ్తారు. కింగ్‌స్ట‌న్‌ గర్ల్ ఫ్రెండ్ రోజా ( దివ్యభారతి ) కూడా వాళ్ళ షాప్ లో వెళుతుంది. వాళ్ళు సముద్రంలోకి వెళ్ళాక ఎలాంటి ఇబ్బందులు పేస్ చేశారు ? అక్కడ దయ్యాలు ఆత్మలు ఉన్నాయా ? వీళ్లంతా తిరిగి వచ్చారా ? అసలు సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు చనిపోతున్నారు ? బోసయ్యని ఎందుకు చంపారు .. ఎవరు చంపారు ? సముద్రంలో నిజంగానే బోస‌య్య‌ అయ్యే ఆత్మ ఉందా ?  థామస్ కి ఆ ఊరికి ఉన్న సంబంధం ఏంటి ? అనేది తెలియాలంటే సినిమా తెరమీద చూడాల్సిందే.


విశ్లేష‌ణ :
సినిమా మెయిన్ పాయింట్ చాలా ఆస‌క్తిగా ఉంటుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కోరుకునేవారిని ఈ సినిమాలో లైన్ మెప్పిస్తుంది. చాలా మూమెంట్స్ అయితే ఆస‌క్తిగా, థ్రిల్లింగ్‌గా ఉంటూ అదిరిపోతాయి. సెకండాఫ్‌లో చాలా సీన్లు బాగుంటాయి. మ‌రీ ముఖ్యంగా సముద్రంలో పలు యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. వీటితో పాటుగా కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా సినిమా చూస్తోన్న ప్రేక్ష‌కుడిని మెస్మ‌రైజ్ చేస్తాయి. యంగ్ హీరో జీవి ప్రకాష్ కుమార్ మంచి పెర్ఫామెన్స్ ని అందించాడు. ఈ సినిమాలో తన రోల్ కి బాగా సెట్ అవ్వ‌డంతో పాటు పలు కీలక సన్నివేశాలలో తన నటనతో మెప్పించాడు. ఫ‌స్టాఫ్‌లో 1982లో జరిగింది కాస్త కథ చూపించి ప్రస్తుతంలో హీరో పాత్ర, ఆ ఊరి వాళ్ళ కష్టాలు, హీరో పని చూపిస్తారు. థామస్ ని ఎదిరించి హీరో సముద్రంలోకి వెళ్లడంతో సెకండ్ హాఫ్ దయ్యాలను చూపిస్తాడా ? సముద్రంలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ ఉంటుంది. సెకండాఫ్ కథ అంత స‌ముద్రం మీదే ఉండ‌డంతో ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుంది.


బోటులో వీళ్లంతా చేసే అడ్వెంచర్స్, అక్కడ దయ్యాలు, ఆత్మలు, అసలు సముద్రంలో ఏముంది అని హారర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో సాగుతుంది. సినిమాలో కొన్ని సీన్లు.. టేకింగ్ కేజీయ‌ఫ్ స్టైల్‌ను గుర్తు చేసేలా ఉంటుంది. ఫ‌స్టాఫ్ కాస్త స్లో నెరేష‌న్‌లో ఉన్నా సెకండాఫ్ అంతా అదిరిపోతుంది.. సముద్రం నేప‌థ్యంలో వ‌చ్చే సీన్లు... ఉత్కంఠ‌.. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఏదో ఒకటి రెండు సార్లు భయపెట్టినా సెకండ్ హాఫ్ లో మాత్రం బాగానే భయపెట్టారు. క్లైమాక్స్ ట్విస్టులు బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. అయితే త‌మిళ పాత్ర‌లు.. ఆ పేర్లు కాస్త గంద‌ర‌గోళం అనిపించాయి. ఈ సినిమాకు సీక్వెల్స్ ఉంటాయ‌ని చెప్పాడు జీవీ ప్ర‌కాష్‌. ఇది ప్రాంచైజీగా వ‌ర్క‌వుట్ చేసుకోవ‌చ్చు.. అంత డెప్త్ ఉంది క‌థ‌లో.. ! జీవి ప్రకాష్ కి నటుడిగా 25వ సినిమా కావడంతో బాగా క‌ష్ట‌ప‌డ్డాడు. హీరోయిన్ దివ్య భార‌తి చూడ‌డానికి బాగున్నా ఆమె పాత్ర‌ను ఇంకా బ‌లంగా రాసుకోవాల్సింది.


టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్‌...
టెక్నిక‌ల్‌గా చూస్తే వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ మీద ఇంకా కాన్‌సంట్రేష‌న్ చేయాల్సింది. జీవీ ప్ర‌కాష్ మ్యూజిక్ బాగుంది. సినిమాటోగ్ర‌ఫీ స‌ముద్రం నేప‌థ్యంలో వ‌చ్చే సీన్ల ప‌రంగా చూస్తే అదుర్స్ అనిపించింది. ఎడిటింగ్ ఇంకాస్త బెట‌ర్‌గా.. ఫ‌స్టాఫ్‌లో కొన్ని సీన్ల‌కు క‌త్తెర వేసి ఉంటే బాగుండేది. తెలుగు డబ్బింగ్ పర్వాలేదు. దర్శకుడు కమల్ ప్రకాష్ విషయానికి వస్తే.. తన మొదటి సినిమాకి కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్నారు.. ఆ ప్ర‌య‌త్నంలో చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో అత‌డి ప‌నిత‌నం క‌నిపించింది. కొన్ని ఎలిమెంట్స్ తాను బాగా హ్యాండిల్ చెయ్యగలిగారు.


ఫైన‌ల్‌గా...
ఓవ‌రాల్‌గా చూస్తే కింగ్‌స్ట‌న్ అనే సముద్రపు అడ్వెంచర్ డ్రామా కొత్త సినిమాలు.. కొత్త త‌ర‌హా అనుభూతిని అస్వాదించే వాళ్ల‌కు బాగా న‌చ్చుతుంది.. ఫ‌స్టాఫ్‌లో కాస్త స్లో నెరేష‌న్ ఉన్నా సెకండాఫ్ సినిమాను నిల‌బెట్టింది.


కింగ్‌స్ట‌న్ రేటింగ్ : 2.75 / 5

మరింత సమాచారం తెలుసుకోండి: