తెలుగు సినిమాలకు సంబంధించి 2025లో అప్పుడే రెండు నెలలు గడిచిపోవడంతో ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది అంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ రెండు నెలలలో తెలుగు సినిమాలతో పోటీగా డబ్బింగ్ సినిమాలు కూడ విడుదల అవ్వడం ఒక పరిణామం. జనవరిలో సంక్రాంతికి విడుదల అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫిబ్రవరిలో విడుదలైన ‘తండేల్’ మూవీలు తప్ప మరే తెలుగు సినిమాలు బయ్యర్లకు లాభాలు తెచ్చి పెట్టలేక పోయాయి.



సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహరాజ్’ బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ మాత్రమే చేసింది అని అంటున్నారు. డబ్బింగ్ సినిమాలకు వస్తే ‘మార్కో’ మూవీ  అద్భుతాలు చేయలేకపోయినా ఈమూవీ పై బయ్యర్లు పెట్టిన పెట్టుబడి వెనక్కు వచ్చింది అని అంటున్నారు. ఇక ఫిబ్రవరిలో రిలీజ్ అయిన  ‘ది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కేవలం నాలుగు కోట్ల బిజినెస్ జరిగితే ఆమూవీకి మూడింతల లాభాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది.



లేటెస్ట్ గా విడుదలైన ‘ఛావా’ తెలుగు డబ్బింగ్ కు మంచి స్పందన వస్తోంది. హిందీ వెర్షన్ వచ్చిన చాలా కాలానికి ఈ తెలుగు డబ్బింగ్ విడుదల అయినప్పటికీ ఈమూవీకి మొదటిరోజు 3 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చాయి అన్న వార్తలు షాకింగ్ గా మారాయి. ఇప్పటికే బుక్ మై షోలో లక్ష టికెట్లు ఈసినిమాకు సంబంధించి అమ్మకం జరిగింది అన్న వార్తలు విన్నవారికి తెలుగు ప్రజలు డబ్బింగ్ సినిమాలను ఎంత విశాల హృదయంతో డబ్బింగ్ సినిమాలను ఆదరిస్తారో అర్థం అవుతుంది.



ఈమధ్య కాలంలో విడుదలైన స్ట్రెయిట్ సినిమాలేవీ మేజిక్ చేయలేకపోయాయి అన్నది వాస్తవం. భారీ అంచనాలతో విడుదలైన  ‘మజాకా’ ‘బ్రహ్మ ఆనందం’ ‘రామం రాఘవం’ లాంటి సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో పాటు ఆసినిమాలకు ఖర్చు పెట్టిన పబ్లిసిటీ ఖర్చులు కూడ రాలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో బయ్యర్లు రిస్క్ చేసి తెలుగు సినిమాలు కొనుక్కునే కంటే తక్కువ డబ్బుతో డబ్బింగ్ సినిమాలను కొనడం మంచిది కదా అన్న ఆలోచనలలో ఉన్నట్లు తెలుస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: