ఒకప్పుడు వెండితెరపై మెరిసిన తార.. ఇప్పుడు చీకటి సామ్రాజ్యంలో చిక్కుకుంది. కన్నడనాట రెండు సినిమాలతో మెరిసిన అందాల భామ రన్యా రావు.. స్మగ్లింగ్ రాణిగా మారడం సంచలనం రేపుతోంది. పెద్దింటి ఆడబిడ్డ.. చూడచక్కని రూపం.. కానీ విధి వక్రీకరించి నేరాల ఊబిలోకి లాగింది. దుబాయ్ కేంద్రంగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌లో కీలక నిందితురాలిగా రన్యా పేరు తెరపైకి రావడం కలకలం రేపుతోంది.

విషయం ఏంటంటే, మార్చి 2న దుబాయ్ నుంచి బెంగుళూరు విమానాశ్రయానికి బంగారు బిస్కెట్లతో వచ్చిన రన్యా రావును కస్టమ్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విమానాశ్రయంలోనే కాదు.. ఆమె ఇంటిలోనూ ఏకంగా 14.2 కిలోల బంగారం బయటపడటంతో అధికారులు షాక్ తిన్నారు. నడుముకు, కాళ్ళకు, షూలలో బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేస్తున్న ఈ అమ్మడు టాలెంట్ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

రన్యా రావు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సవతి కుమార్తె అని తేలడంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్‌గా మారింది. విమానాశ్రయంలో వీఐపీ ప్రోటోకాల్ దుర్వినియోగం చేసిందా? తండ్రి పేరు చెప్పి భద్రతా తనిఖీలు దాటిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారంపై సీరియస్ ఎంక్వైరీకి ఆదేశించింది.

అసలు పేరు హర్ష వర్ధిని.. కానీ సినిమా ఇండస్ట్రీ కోసం రన్యా రావుగా మారింది. ఒకప్పుడు రమ్య నటించాల్సిన 'మాణిక్య' సినిమాలో ఛాన్స్ కొట్టేసి.. ఆ తర్వాత 'పటాకి'లోనూ మెరిసింది. పేరు మార్చింది కిచ్చా సుదీప్ అట! కానీ రెండు సినిమాల తర్వాత ఏమైందో ఏమో.. సడన్‌గా తెరమరుగైంది. మళ్లీ ఇన్నాళ్లకు స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇదిలా ఉంటే.. విచారణ పేరుతో డీఆర్‌ఐ అధికారులు రాత్రింబవళ్లు నిద్ర పోనివ్వకుండా వేధిస్తున్నారని రన్యా లాయర్ కోర్టులో వాపోయారు. అరెస్ట్ సమయంలో ప్రొటోకాల్ పాటించలేదని, బెయిలు ఇవ్వాలని కోర్టును వేడుకున్నారు. కానీ కోర్టు మాత్రం బెయిలు తిరస్కరించింది.

ఇంకో విషయం ఏంటంటే.. రన్యా రావు పెళ్లి చేసుకున్న జతిన్ హుక్కేరి గురించీ ఆరా తీస్తున్నారు. పెళ్లికి ఎవరెవరు వచ్చారు, ఏం గిఫ్టులు ఇచ్చారు? అనే వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. పెళ్లి వీడియోలు, ఫోటో ఆల్బమ్‌లు కూడా జప్తు చేశారు. అంటే ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారో అని డీఆర్‌ఐ గట్టిగానే దర్యాప్తు చేస్తోంది.

మొత్తానికి వెండితెర మెరుపులా వచ్చి.. చీకటి సామ్రాజ్యంలో కూరుకుపోయిన రన్యా రావు కథ ఇప్పుడొక సంచలనంగా మారింది. ఈ కేసులో ఇంకెన్ని ట్విస్టులు బయటపడతాయో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: