బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా నటించిన 'ఛావా' సినిమా ఊహించని విధ్వంసం సృష్టిస్తోంది. విడుదలై నెల రోజులు దాటినా కూడా వసూళ్ల ప్రభంజనం ఏమాత్రం తగ్గడం లేదు. ఇంకా చెప్పాలంటే రోజురోజుకూ మరింత ఉత్సాహంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. చిన్న సినిమాలు సైతం వారం తిరిగేసరికి థియేటర్ల నుంచి మాయమవుతున్న ఈ రోజుల్లో, 'ఛావా' మాత్రం ఏకంగా 31 రోజులు పూర్తి చేసుకుని కూడా అదే జోరు కొనసాగించడం నిజంగా ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అసలు విషయానికొస్తే, 31వ రోజున ఈ సినిమా ఏకంగా 7.63 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి అందరినీ షాక్‌కు గురిచేసింది. బాలీవుడ్ చరిత్రలోనే 31వ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా 'ఛావా' సరికొత్త రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఈ రికార్డు విక్కీ కౌశల్ నటించిన 'ఉరి' సినిమా పేరు మీద ఉండగా, ఇప్పుడు తన సినిమా రికార్డును తానే బ్రేక్ చేయడం విశేషం.

ఇంకా ఐదవ వీకెండ్ లో 'ఛావా' కలెక్షన్ల వేగం చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. ఈ వారాంతంలో ఏకంగా రూ.22 కోట్లు కొల్లగొట్టింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, 'పుష్ప 2' (హిందీ వెర్షన్), 'స్త్రీ 2' లాంటి భారీ చిత్రాల వసూళ్లను కూడా 'ఛావా' దాటేసింది. ఆ సినిమాలు ఈ వారాంతంలో 16 కోట్లు, 14 కోట్లు మాత్రమే వసూలు చేయగా, 'ఛావా' మాత్రం వాటికి అందనంత ఎత్తులో నిలిచింది. శుక్రవారం 6.75 కోట్లు, శనివారం 7.62 కోట్లు, ఆదివారం 7.63 కోట్లు వసూలు చేసిందంటే ఈ సినిమా హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దాదాపు 130 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్నాతో పాటు అక్షయ్ ఖన్నా కూడా కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పటివరకు 'ఛావా' సాధించిన మొత్తం కలెక్షన్ల విషయానికొస్తే.. ఇండియాలో 562.38 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 752.81 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా 13 కోట్ల రూపాయలు వసూలు చేసి సత్తా చాటింది. మొత్తానికి 'ఛావా' సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలన విజయాన్ని నమోదు చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: