
వ్యక్తిగత జీవితంలో నువ్వా నేనా అన్నట్టుగా గొడవలు పడుతున్న మంచు బ్రదర్స్ ... మంచు విష్ణు, మంచు మనోజ్ బాక్సాఫీస్ వద్ద కూడా ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో సై అనేందుకు సిద్ధమవుతున్నారు. నిజ జీవితంలో గొడవ లతో ఢీ కొట్టుకుంటోన్న ఈ మంచు సోదరులు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర కూడా పోటీ పడుతూ బాక్సాఫీస్ ను హీటెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. అసలు విషయం లోకి వెళితే ఏప్రిల్ 25 కన్నప్ప భారీ ఎత్తున ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచే ఈ సినిమా ప్రమోషన్లు కూడా మొదలు పెట్టారు.
త్వరలోనే భారీ ఎత్తున ప్రి రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని చూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్‌కు ప్రభాస్ తో సహా క్యాస్టింగ్ మొత్తం హాజరయ్యేలా విష్ణు ప్లానింగ్ చేస్తున్నారు. దాని మీదే డేట్ ఎప్పుడనేది నిర్ణయిస్తారు. ఇక శ్రీకాళహస్తి లో ఈ ఈవెంట్ చేయాలన్న ఆలోచనలో ప్రస్తుతానికి విష్ణు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. అన్న సినిమా ఇలా ఉంటే తమ్ముడు మంచు మనోజ్ కీలక పాత్ర పోషించిన భైరవం సినిమాను సైతం ఏప్రిల్ 25నే రిలీజ్ చేసే ప్లాన్ జరుగుతోంది.
వాస్తవానికి భైవరం సినిమా ను జనవరి లేదా ఫిబ్రవరిలోనే అనుకున్నా లేట్ అయ్యింది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ చాలా గ్యాప్ తర్వాత చేసిన తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల ఈ సినిమా దర్శకుడు. నారా రోహిత్, మంచు మనోజ్ హీరో స్నేహితులుగా ముఖ్యమైన పాత్రలు చేస్తుండ గా ... కోలీవుడ్ సీనియర్ దర్శకుడు శంకర్ కూతురు అదితి ఈ సినిమా తో తెలుగు తెరకు స్ట్రెయిట్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఏదేమైనా మంచు అన్నదమ్ములు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర తమ సినిమాలతో పోటీ పడితే పోరు మామూలుగా ఉండదు.