
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న నటులపై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)ను కోరనున్నట్లు TFCC ప్రకటించింది. రెండు రోజుల్లో MAAకు అధికారికంగా లేఖ రాయనున్నట్లు తెలిపింది. సినిమా ప్రముఖులతో సహా అందరూ చట్టాన్ని పాటించాలని TFCC స్పష్టం చేసింది. సమాజానికి హాని చేసే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం తప్పు అని పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై పోలీసులు ఫోకస్ పెంచారు. స్థానిక వ్యాపారి ఫణీంద్ర శర్మ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి శ్యామలతో పాటు పలువురు టీవీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ఇతరుల పేర్లను చేర్చారు. పోలీసులు క్రిమినల్ చార్జీలు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రమోషన్లు బ్యాన్ చేసినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉంది. సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లతో అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు, యాడ్స్‌ను చట్టబద్ధమైన రాష్ట్రాల్లో మాత్రమే చూపించేలా చూసుకోవాలి. అయితే, తెలంగాణలో యాడ్స్ కనిపిస్తే, యాప్ ఆపరేటర్లతో పాటు సెలబ్రిటీలపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తేల్చి చెప్పారు. సెలబ్రిటీలపై మరింత యాక్షన్ లీగల్ ఎక్స్‌పర్ట్స్, సీనియర్ అధికారులపై ఆధారపడి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి. బెట్టింగ్ భూతం పై మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. దాన్ని అణగదొక్కే వరకు వాళ్లు నిద్రపోయేలా లేరు.