
ఎడిటర్ - గ్యారీ బీహెచ్
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
నేపథ్య సంగీతం: శ్రీచరణ్ పాకాల
మ్యూజిక్: శ్రావణ్ భరద్వాజ్
నిర్మాత : సాయి అభిషేక్
దర్శకత్వం : డాక్టర్ అనిల్ విశ్వనాథ్
రిలీజ్ డేట్ : 4 ఏప్రిల్, 2025
28°C సినిమా, ఉష్ణోగ్రతను ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కిన చిత్రం. నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి ‘మా ఊరి పొలిమేర’ఫేం డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఈరోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది.. టైటిల్‌కు తగినట్టుగా ఈ సినిమాకు జస్టిఫికేషన్ ఇచ్చారా ? సరికొత్తగా ఆకట్టుకునేలా ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెస్మరైజ్ చేసిందో చూద్దాం.
స్టోరీ :
ఓ అమ్మాయి హత్య కేసును విచారించడానికి వచ్చిన పోలీస్ అధికారి (రాజా రవీంద్ర), డాక్టర్ కార్తీక్ (నవీన్ చంద్ర) ఈ హత్యకు కారణం అని సందేహిస్తాడు. కార్తీక్ ఇంట్లోనే ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో కార్తీక్, డాక్టర్ అంజలి (షాలినీ వడ్నికట్టి) ప్రేమ కథ ఉంటుంది. వైజాగ్ లో మెడికల్ విద్యను అభ్యసిస్తున్న కార్తీక్, అంజలిని ప్రేమిస్తాడు. వారు పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుదాం అనుకుంటున్న టైంలోనే అంజలి అనారోగ్యానికి గురవుతుంది. ఈ క్రమంలోనే ఆమె గురించి వైద్యులు ఓ షాకింగ్ న్యూస్ చెపుతారు. అంజలి 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను మాత్రమే తట్టుకోగలదని వైద్యులు చెబుతారు. కార్తీక్ ఆమెను పెళ్లి చేసుకుని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కార్తీక్, అంజలి జార్జియా ఎందుకు వెళ్లారు? అక్కడ అంజలి ఆరోగ్యం మెరుగుపడిందా ? కార్తీక్, అంజలి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది ? అమ్మాయి హత్య కేసులో కార్తీక్ నిందితుడిగా ఎందుకు మారాడు ? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ:
ప్రేమకు త్యాగమే అర్థం.. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరని చెప్పే ఎమోషనల్ లవ్‌స్టోరీ ఇది. ఈ సినిమా నేపథ్యం, కథ కొత్తగా ఉంటాయి. ఈ కథకు 28°C అనే కొత్త పాయింట్‌ను జోడించి, దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ కొత్త తరహా ప్రేమ, సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. అమ్మాయి హత్య కేసు ఇన్వెస్టిగేషన్‌తో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. అక్కడి నుంచి ఫ్లాష్‌బ్యాక్ వైజాగ్‌కు మారుతుంది. వైజాగ్ ఫ్లాష్‌బ్యాక్‌లో కార్తీక్, అంజలి ప్రేమ కథ ఆహ్లాదకరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ఆ తర్వాత అంజలికి హెల్త్ బాగోలేదని తెలవడం.. ఆమెను కాపాడుకునేందుకు కార్తీక్ చేసే ప్రయత్నాలు మనస్సును టచ్ చేస్తాయి. ఇక జార్జియా వెళ్ళిన తర్వాత కార్తీక్, అంజలి జీవితాల్లో ఎదురైన సంఘటనలు ఉత్కంఠను రేకెత్తిస్తాయి. సెకండాఫ్ ప్రారంభమైన కాసేపటి నుండి, 28°C సినిమా ఊహకు అందని ఆసక్తికరమైన మలుపులతో కొనసాగుతుంది.
దర్శకుడు డాక్టర్ కాబట్టి, వైద్య పరమైన విషయాలను ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమయ్యేలా బాగా చెప్పారు. ఇక సినిమాకే మేజర్ హెలెట్స్‌లో ఒకటి అయిన రివ్యూలో చెప్పకూడని ఒక పాత్ర కథను పూర్తిగా మారుస్తుంది. ఆ పాత్ర ఎవరు, ఏమిటి అనేది తెర మీద చూస్తేనే ఆ మజా వేరుగా ఉంటుంది. సినిమాలో నవీన్ చంద్ర కార్తీక్‌గా చాలా బాగా నటించాడు. ఆరేళ్ల కిందటి సినిమా కాబట్టి, ఈ ప్రేమ కథలో అతను ఇప్పటికంటే తాజాగా, యవ్వనంగా కనిపించాడు. షాలినీ అంజలి పాత్రకు సరిగ్గా సరిపోయింది. ఆమె నటన మెప్పిస్తుంది. ప్రియదర్శి, హర్ష చెముడు, అభయ్ బేతిగంటి స్నేహితుల పాత్రలకు న్యాయం చేశారు. సినిమా నిడివిని తగ్గించడం వల్ల వారి వినోదభరిత సన్నివేశాలు తొలగించినట్లు అనిపించింది.
28°C సినిమా టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి . శ్రావణ్ భరద్వాజ్ పాటలు, శ్రీచరణ్ పాకాల బీజీఎం ఆకట్టుకుంటాయి. నిర్మాత సాయి అభిషేక్ అభిరుచి మొదటి సినిమాలోనే తెలుస్తోంది. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మంచి భావోద్వేగభరితమైన ప్రేమ కథను కూడా బాగా తెరకెక్కించగలడని 28°C సినిమా నిరూపించింది. ఆయన రచనా శైలి కూడా ఆకట్టుకుంటుంది. అనిల్ విశ్వనాథ్ అతిథి పాత్రలో చిన్న సన్నివేశంలో కనిపిస్తారు.
ప్లస్ పాయింట్స్:
- అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం
- శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్
- శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం
- ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉండడం
- సెకండాఫ్ ఉత్కంఠగా సాగడం
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ లో కాస్త సాగతీత.
- కొన్ని డార్క్ సీన్స్.
ఫైనల్‌గా...
ఆరేళ్ల కిందట మొదలైన ఈ సినిమా ప్రయాణం ఆకట్టుకునేలా ఉంది. ప్రేమకథలో థ్రిల్లింగ్ అంశాలు ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. డాక్టర్లు అయిన కార్తీక్, అంజలి ప్రేమ వివాహం చేసుకోవడం, ఆ తర్వాత అంజలికి అనారోగ్యం... ఆమెను 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలోనే ఉంచుతూ, కాపాడుకోవల్సిన పరిస్థితి. ఉష్ణోగ్రత పెరిగితే ఆమె ప్రాణాలకు ప్రమాదం లాంటి పరిస్థితుల మధ్య ఓ జంట చేసిన ఎమోషనల్ జర్నీయే ఈ సినిమా. స్వతహాగా వైద్యుడైన దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కొన్ని పుస్తకాల స్ఫూర్తితో, వైద్య పరమైన అంశాలతో ఆసక్తికరంగా ఈ సినిమాని మలిచారు. కొత్త తరహా కథాంశాలతో తెరకెక్కే సినిమాలు, థ్రిల్లింగ్ సినిమాలు ఎంజాయ్ చేసే వారికి ఈ సినిమా మంచి ఆప్షన్.
రేటింగ్: 2.75 / 5