అవును, ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకు చేదు వార్తే. నిన్న మొన్నటి వరకు డార్లింగ్ ప్రభాస్ ఆ దర్శకుడి కాంబోలో సినిమా చేయబోతున్నాడని అభిమానులు తెగ సంబర పడ్డారు. అదిరిపోయే లైనప్ తో డార్లింగ్ దూసుకు పోతున్నాడు అని పండగ చేసుకున్నారు. అయితే అది అబద్ధం అని తేలిపోయింది. సోషల్ మీడియాలో వెలువడిన పక్కా ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. మీరు విన్నది నిజమే. ‘జటాయు’.. తన డ్రీమ్‌ ప్రాజెక్టు అని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి గతంలో ప్రకటించగానే, ఆ సినిమా ప్రభాస్‌ తో చేయబోతున్నారని అంతా అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలపై నీళ్లు జల్లేశాడు ఇంద్రగంటి!

తాజాగా ఆ విషయాన్ని ఓ విలేకరి ప్రస్తావించగా దర్శకుడు స్పందిస్తూ... "ఇలాంటి వార్తలు నా దగ్గరికి కూడా వచ్చాయి. అయితే దురదృష్టవశాత్తూ ఆ వార్తల్లో నిజం లేదు. అయితే నాకు మాత్రం డార్లింగ్ తో సినిమా చేయాలని ఎప్పటి నుండో వుంది. ఎప్పుడో ఒకప్పుడు జరిగి తీరుతుందని ఆశిస్తున్నాను. అయితే జటాయు మూవీకి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తాను." అని ‘సారంగపాణి జాతకం’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఇకపోతే... ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం ‘సారంగపాణి జాతకం’. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 25న సినిమా విడుదల కానుంది. ఇటీవల ఓ డ్యాన్స్ షోకి మోహనకృష్ణ అతిథిగా వెళ్లగా.. ఓ డ్యాన్సర్ పెర్ఫార్మెన్స్‌ని ఆయన కొనియాడడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. అలనాటి నటి సావిత్రి క్లాసికల్ సాంగ్‌కు అసభ్యకరమైన దుస్తుల్లో డ్యాన్స్ చేసిన వారిని మెచ్చుకోవడం ఏంటంటూ కొందరు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై దర్శకుడు మాట్లాడుతూ.. అలాంటి షోలో స్వేచ్ఛగా అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం కూడా నాకు ఉండదా? అని బాధపడ్డారు. ప్రదర్శన ఇచ్చిన అమ్మాయి కష్టం మాత్రమే చూశానని, అలాంటి పాటలకు ఇలా డ్యాన్స్ చేయడం గురించి తప్పక చర్చ జరగాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: