
ఈ ప్రపంచంలో కుస్తీ పోటీలకు WWE (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్) చాలా ప్రసిద్ధి గాంచింది అని చెప్పుకోవచ్చు. ఆ కారణం చేతనే ఈ టెలివిజన్ రియాలిటీ షోకు ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు.. ఆఖరికి భారత్లో కూడా! అందుచేతనే ఇందులో పాల్గొనే రెజ్లర్లకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వుంది. అయితే ఈ షోకు వెళ్లిన మొట్ట మొదటి ఇండియన్ సెలబ్రిటీగా మాత్రం టాలీవుడ్ హీరో రాణా దగ్గుబాటి రికార్డు సృష్టించారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆహ్వానం మేరకు అమెరికా లాస్వేగాస్లోని అలిజియంట్ స్టేడియంలో జరిగిన వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాచ్లో రాణా సందడి చేయడం జరిగింది. అనంతరం తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో రానా... "41వ రెజిల్మేనియా మ్యాచ్ను లైవ్లో చూడడం ఓ వింతైన అనుభవం. చాలా అద్భుతంగా వుంది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మనందరి బాల్యంలో ఒక భాగం. ఇప్పుడు, దానిని ప్రత్యక్షంగా చూడటం, ప్రపంచ వేదికపై భారతదేనికి ప్రాతినిధ్యం వహించగలగడం నిజంగా గర్వంగా అనిపిస్తోంది." అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. కాగా ఈ మేరకు నెట్ఫ్లిక్స్ రానా ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట్లో ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ రెజిల్‌మేనియా అనేది అతిపెద్ద రెజ్లింగ్ ఈవెంట్. ఇది WWE సూపర్ బౌల్ లాంటిది, అంటే అగ్రశ్రేణి రెజ్లర్లందరూ ఇక్కడికి విచ్చేస్తారు. ఈ క్రమంలోనే భారీ యాక్షన్, వినోదం రెజ్లింగ్ ప్రియుల కోసం అందిస్తారు. ఈ 41వ రెజ్లింగ్ మేనియా ఏప్రిల్ 19-20 తేదీల్లో లాస్వేగాస్లో జరగగా... ఈ ఈవెంట్లో ప్రముఖ రెజ్లర్ జాన్ సీన సందడి చేశారు. కోడీ రోడ్స్పై జాన్ సీన విజయం సాధించారు. దీంతో 17 టైటిళ్లతో అత్యధిక సార్లు WWE వరల్డ్ టైటిళ్లు గెలిచిన రెజ్లర్గా జాన్ సీన రికార్డు సృష్టించారు.