రామ్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఒంగోలు గిత్త’. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. కుటుంబ కథా చిత్రాలతో గుర్తింపు తెచుకున్న భాస్కర్ ఈ సినిమాను ‘ఒంగోలు గిత్త’ అనే టైటిల్ తో మాస్ కథాంశంతో తెరకెక్కించడంతో అంతా ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురుచూశారు. మరి ‘ఒంగోలు గిత్త’ ఎలా ఉందో చూద్దాం..!
చిత్రకథ :
వైట్ [రామ్] తన చిన్నతనంలోనే ఒంగోలు మిర్చి యార్డులో ప్రవేశిస్తాడు. తెలివితేటలతో వ్యాపారం చేస్తూ, తన దూకుడుతో మిర్చి యార్డు ఛైర్మన్ ఆదికేశవులు [ప్రకాష్ రాజ్] ను ఢీకొంటాడు. అతని కుమార్తె సంధ్య [కృతి కర్భందా]ను దక్కించుకోవాలనుకుంటాడు. అసలు వైట్ ఎవరు...?, ఆదికేశవులు మీద అతనికి పగ ఎందుకు..?, సంధ్యను వైటు దక్కించుకున్నాడా... అన్నదే చిత్రకథ.
నటీనటుల ప్రతిభ :
రామ్ చాలా ఉత్సాహంగా నటించాడు. ప్రకాష్ రాజ్ ను ఇరుకును పెట్టాలనుకునే సన్నివేశాలలో రామ్ నటన బావుంది. పైట్లు, డాన్సుల్లో తన ఎనర్జీ చూపించాడు. మంచివాడిగా నటించే చెడ్డవాడి పాత్రలో ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ నటించాడు. ప్రకాష్ రాజ్ కు ఇలాంటి పాత్రలు కొత్త కాదు. అయితే ఈ చిత్రంలో అతను చాలా ‘బోల్డ్’గా నటించాడు. ప్రకాష్ రాజ్ కు నగ్నంగా నటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో గానీ, ఆయా సన్నివేశాలను తెర మీద చూడ్డానికి చాలా ఇబ్బంది పడతాము. కృతి గ్లామర్ డాల్ గా కనిపిస్తుంది. అందంతో ఆకట్టుకున్నా నటించడానికి కృతికి ఈ సినిమాలో చాన్సు దక్కలేదు. ప్రభు నటన సహాజంగా ఉంది. రఘుబాబు కామెడీ బావుంది. అతను చెప్పే ‘తిక్క ఉంది. కానీ దానికి లెక్కలేదు’ వంటి డైలాగులు నవ్వులు పూయిస్తాయి. బ్యాడ్ బోయ్ ‘అలీ’ -రామ్ ల మధ్య సాగే రాత్రి సన్నివేశానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కిషోర్ దాసు, రమాప్రభ... తదితరులు తమ పాత్రల పరిధిలో నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
ఫోటోగ్రఫీ, మ్యూజిక్ యావరేజ్ గా ఉన్నాయి. గుర్తించుకునే పాటలు లేవు. అయితే జానపద గీతం ఆకట్టుకుంటుంది. మాటలు పెద్దగా ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తండ్రికి జరిగిన అన్యాయానికి తనయుడు ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించాడు. దీనికి మిర్చి యార్డు నేపథ్యాన్ని, కామెడీని కలిపాడు. చిత్రం ప్రారంభంలో చైల్డ్ హీరో పరిచయాన్ని, తక్కువ ధరకే నిమ్మకాయాలు కొని, ఎక్కువ రేటుకు వాటిని అమ్మే సన్నివేశాన్ని చక్కగా చూపించిన దర్శకుడు చివరి వరకూ అదే జోరు చూపించలేక పోయాడు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా వీక్ గా ఉంది. ముగింపులో ట్విస్ట్ ను ముందుగానే ఊహించవచ్చు.
హైలెట్స్ :
రామ్ నటన, కామెడీ సన్నిశాలు, కృతి గ్లామర్
డ్రాబ్యాక్స్ :
పాత కథ, ఆకట్టుకోని స్ర్కీన్ ప్లే, బోర్ కొట్టే సన్నివేశాలు
విశ్లేషణ :
రామ్-బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో సినిమా అంటే అందరూ ఒక ప్రేమకథ సినిమాను ఊహిస్తారు. లేదా కుటుంబ నేపధ్యంలో ఒక చలాకీ కుర్రాడు కధను, లేకపోతే యూత్ సినిమాను మనసుల్లో అనుకుంటారు. అయితే దీనికి భిన్నంగా వీళ్లు ‘ఒంగోలు గిత్త’ అనే మాస్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మాస్ సినిమాను కూడా తన క్లాస్ పద్ధతిలో చూపించడానికి బొమ్మరిల్లు భాస్కర్ ట్రై చేశాడు. దర్శకుడు పగ-ప్రతీకారం అనే కథను స్ర్కీన్ ప్లే, కామెడీ తో నడపడానికి కృషి చేశాడు. ఈ ప్రయత్నంలో కామెడీతో ఆకట్టుకున్నా, స్ర్కీన్ ప్లే లో ఫెలయ్యాడు. సినిమా రెండవ భాగం, ముఖ్యంగా ముగింపు ఈ సినిమా విజయానికి అడ్డు పడే విధంగా ఉన్నాయి. వీటి మీద దర్శకుడు మంచి కృషి చేస్తే మంచి ఫలితం దక్కేది. ‘ఊర మాస్’ అంటూ హీరో రామ్ చెప్పిన ఈ సినిమా అంత మాస్ సినిమా స్థాయిలో తెరకెక్కలేదు. రామ్ యాక్షన్- డాన్సులు, ప్రకాష్ రాజ్ నటన చూడాలనుకునేవారు ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు.
చివరగా :
యాక్షన్, కామెడీలతో బొమ్మరిల్లు భాస్కర్-రామ్ చేసిన ప్రయత్నం ‘ఒంగోలు గిత్త’