సిని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల కాలంలో ఏ సినిమాకు ఏర్పడని క్రేజ్ ను ఈ సినిమా దక్కించుకుంది. అందుకు కారణం ఈ సినిమాలో ప్రముఖ హీరోలు వెంకటేష్, మహేష్ కలసి నటించడమే. ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!
చిత్రకథ :
నేనింతే, నా తీరింతే అని మొండిగా ఉంటూ ఏ ఉద్యోగంలోనూ నిలదొక్కులేక పెద్దోడు [వెంకటేష్], అందర్నీమాటల గారడీతో బుట్టలో వేసుకునే నేర్పరి, అయినా ఇంకా ఉద్యోగం రాని చిన్నోడు [మహేష్], పుట్టినప్పుడే అమ్మానాన్నల్ని పోగొట్టుకుని మామయ్య దగ్గరే పెరిగిన సీత [అంజలి], ఇదీ మనుష్యులందరూ మంచివాళ్లే అనుకునే సత్తెకాలపు ‘రేలంగి’ [ప్రకాష్ రాజ్] గారి కుటుంబం. సీతని, రేలంగి కుటుంబాన్ని దురదృష్టవంతులుగా భావించి, చులకన చేసే సీత పెదనాన్న[రావు రమేష్]. అందుకే పెద్దోడికి పరమ చిరాకు వాళ్లంటే.
పెద్దోడంటే చిన్నోడుకి, చిన్నోడంటే పెద్దోడికి సచ్చేంత ప్రేమాభిమానాలు, కానీ ఒక పక్క కెరీయర్ తలనొప్పులు, మరో పక్క పెద్దోడు చిరాకు పడే ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే చిన్నోడు... ఇటువంటి సమస్యలు అన్నదమ్ముల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి? వీళ్ళు తమ ప్రేమాభిమాలను ఎలా కాపాడుకున్నారనేది వెండితెరపై చూడాలి.
నటీనటుల ప్రతిభ :
లౌక్యం తెలియని వాడిగా... తమ్ముడి వద్ద చిన్నపిల్లాడిలా... వెంకటేష్ నటించిన తీరు ప్రేక్షకులతో కేకలు పెట్టించకపోయినా గుండెలకు హత్తుకునేలా ఉంది. నిరుద్యోగిగా అసహనం, చిరాకు... ఎమోషనల్ సీన్లలో పరిణితి చెందిన అభినయంతో పెద్దోడి పాత్రకు వెంకటేష్ న్యాయం చేశాడు. మాటలతో గమ్మత్తు చేసే ‘లవర్ బాయ్’ గాను, ఆకతాయి తనంతో ఆకట్టుకునే చలాకీ కుర్రాడిగాను మహేష్ నటన బావుంది. గోదావరి యాసతో మహేష్ చెప్పిన మాస్ డైలాగులు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించాయి. అక్కడక్కడా ఎమోషనల్ సీన్లో తడబడినా... చిన్నోడిగా మహేష్ మెప్పించాడు.
అంజలి అచ్చ తెలుగు అమ్మాయిగా చీరలో చూడటానికి బావుండటమే కాదు... సహజ అభినయం, దానికి తగ్గ డైలాగు డెలవరీతో ఆకట్టుకుని వెంకటేష్ లాంటి అగ్రనటుడి సరసన తన ఎంపిక కరెక్ట్ అని నిరూపించుకుంది. సమంత తనదైన శైలిలో నటించింది. చూడ్డానికి కానీ, ఫెర్ ఫార్మెన్స్ లో కానీ ఎక్కడా కొత్తదనం కన్పించదు. ఎదుటి వారిని మీరెంత అనే పాత్రను రావు రమేష్ బాగానే రంజింప చేశాడు. తనదైన డిక్షన్ ను గోదావరి యాసలో కలిపి మాట్లాడిన తీరు బావుంది. ప్రకాష్ రాజ్, జయసుధ తమకు అలవాటైన నటనతో రాణించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
ఫోటోగ్రఫీ పనితనం ఈ సినిమాకు సరిగ్గా కుదరలేదు. ఇద్దరు పెద్ద హీరోలు కలసి నటించిన సినిమాకు ఫోటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉండాలి. అయితే ఈ సినిమాకు సాధారణ స్థాయిలో కూడా లేదు. చాలా సన్నివేశాలు కంటే పాత తెలుగు సినిమాలు బెటర్ అనిపిస్తాయి. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం, విక్కీ. జే. మేయర్ పాటలు బాగున్నాయి. గుర్తుంచుకునే మాటలు లేవు. మల్టీస్టారర్ చిత్రం స్థాయిలో నిర్మాణ విలువలు లేవు.
కుటుంబ సభ్యుల మధ్య అనుబంధంతో ఈ సినిమాను తెరక్కించాడు. మధ్య తరగతి కుటంబాల్లో జరిగే చిన్న చిన్న గొడవలు, అన్నదమ్ములు మధ్య జరిగే అంశాలతో సినిమాను రూపొందించాడు. కొన్ని సన్నివేశాల్లో తాను చెప్పాలనుకున్న విషయాలను చెప్పగలిగినా చాలా సన్నివేశాల్లో దర్శకుడు ఫెలయ్యాడు.
హైలెట్స్ :
అగ్రకథానాయకుల అన్నదమ్ముల అనుబంధం
మహేష్ పండించిన వినోదం
అంజలి సహజ నటన
మిక్కీ జె మేయర్ సంగీతం
డ్రాబ్యాక్స్ :
ఫోటోగ్రఫీ
ఎడిటింగ్
అసంతృప్తి క్లైమాక్స్
పాటల చిత్రీకరణ
పరిమిత వినోదం
రాజా రవీంద్ర పోలీస్ సన్నివేశం
మహేష్-వెంకటేష్ లు స్నేహితుల సన్నివేశాలు వంటి కథనానికి అడ్డు తగిలే సన్నివేశాలు
విశ్లేషణ :
ఇద్దరు అగ్ర కథానాయకులతో మనసుకు హత్తుకునే సినిమాని తీయాలనుకోవడం కత్తి మీద సాము కన్నా కష్టం. రెండవ ప్రయత్నంలోనే అలాంటి సాహసానికి ఒడిగట్టిన శ్రీకాంత్ అడ్డాలని అభినందించాల్సిందే. వంటి చెత్తో కోట్లాది రూపాయిల కలక్షన్స్ ను కురుపించగల ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించి 25 సంవత్సరాల తరువాత టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలను మళ్లీ మొదలు పెట్టడం శుభపరిణామం.
కలర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్ర్కీన్ పై శ్రీకాంత్ అడ్డాల మానవ సంబంధాల గురించి చెప్పిన మాటలు, అందుకు అనుగుణంగా ఒక మధ్య తరగతి కుటుంబ వాతావరణంలో మొదలైన సినిమా మనం పుట్టిన ఊరు, పెరిగిన ప్రదేశాలను గుర్తు చేసింది. ఇద్దరు హీరోలనీ విభిన్న నేపధ్యాలతో ఒకే ప్రేములో పరిచయం చేసిన విధానం బాగున్నా... నాచురాలిటీ పేరుతో ఇద్దరు స్టార్ హీరోల సోలో పాట [ఏం చేద్దాం..] తేల్చేసిన పద్ధతి నిరాశ కల్గించింది. ‘అరేయ్... అరేయ్’ అంటూ వెంకీ-మహేష్ తో మాట్లాడించిన తీరు బావుంది. ఇటు మహేష్... అటు వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్స్ తో చేసే సీన్లు, తనికెళ్ళ భరణి, రవిబాబుల కామెడీ, రాజా రవీంద్ర పోలీస్ ఎపిసోడ్ ఎందుకొచ్చాయో కూడా తెలియకుండా మానవ సంబంధాల నేపథ్యంలో జరిగే సినిమా గతిని తప్పించాయి.
మహేష్ అమ్మాయిలుతో చెప్పే యాస డైలాగులు బాగున్నాయి. బామ్మతో చేసే చలాకీ అల్లరి, అమ్మ దగ్గర గారాబం ఎంతో ముచ్చటగా అన్పించాయి. అన్నదమ్ముల మధ్య జరిగే సన్నివేశాలు బాగా పండాయి.
కానీ ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న సినిమా మొత్తం ఒకటే తరహాలో స్లోగా కొనసాగడం... నిరాశ కల్గించింది. ఈ మాత్రం దానికి స్టార్ హీరోలు ఎందుకో అర్థం కాలేదు. మహేష్-వెంకీ, వెంకీ-అంజలి మధ్య జరిగే చాలా కొద్ది ఎమోషనల్ సీన్లు తప్పించి మిగిలిన సినిమా మొత్తం కలగాపులగంగా తయారయ్యింది. మానవ సంబంధాలు అని గొప్ప-గొప్ప మాటలు చెప్పి అన్నదమ్ముల అనుబంధాన్ని బోటాబొటీగా చూపించడానికి కూడా దర్శకుడు కష్టపడ్డాడు. అంజలి-వెంకటేష్ అద్భుతమైన నటనతో సినిమాలో ఫీల్ వస్తుందనుకునే టైమ్ కి శుభం కార్డు వేయడం నచ్చిన వాళ్ళు 100 కి 1 కూడా ఉండరు. నలభై కోట్లు.. పెద్ద సినిమా అంటూ ఊదరగొట్టిన ఈ సినిమా... ఏదో లోబడ్జెట్ మూవీలా కన్పిస్తుంది. వెంకి-మహష్ ల అభిమానులే ఈ సినిమాను కాపాడాలి.