‘మిర్చి’ లాంటి ‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్, ‘ఎనర్జిటిక్’ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ల క్రేజీ ‘హిట్’ కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ చిత్రం ‘మిర్చి’. ప్రపంచవ్యాప్త ‘డార్లింగ్’ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ రాజుగారి 16వ సినిమా ఆడియో విడుదల నేడు ‘2013 టాలీవుడ్ మొదటి మ్యూజిక్ ఆల్బామ్’ గా రామానాయుడు స్టూడియోలో అభిమానుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. మరి పాటలు ఎలా ఉన్నాయో చూద్దామా...?
మిర్చి... మిర్చి... మిర్చి... మిర్చి... మిర్చి లాంటి కుర్రాడే...[చిన్నపొన్ను]
ఘాటైన మాస్ పదాలతో హీరోని వర్ణిస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ టైటిల్ పాటకు దేవిశ్రీ అందించిన బాణీ, తమిళ సంగీత దర్శకుడు సెల్వకుమార్ బార్య ‘‘ చిన్నపొన్ను’’ ను తెలుగులో పరిచయం చేస్తూ పాడించిన తీరు హైలెట్స్. రానున్న రోజుల్లో ప్రభాస్ అభిమానుల నోళ్ళలో నానడమే కాకుండా, సినిమాకి బలం చేకూర్చే విధంగా ఉంది ఈ పాట.
పండుగలా దిగి వచ్చావు... ప్రాణాలకు వెలుగిచ్చావు... రక్తాన్నే ఎరుపెక్కించావు...[కైలాష్ ఖేర్ ]
గాత్రంతో భావాలను పలికించడంలో సిద్దహస్తుడైన ‘‘కైలాష్ ఖేర్’’ పాడిన ఈ పాట... సినిమాలో దాగున్న ఫ్యాక్షన్ ఎలిమింట్ ని చెప్పడంతో పాటుగా హీరో పాత్రను మరింత ఎలివేట్ చేసే సిచ్చుయేషనల్ సాంగ్ గా కొనసాగుతుంది. దేవీ ఇలాంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న పాట చేయడం బహుశా ఇదే మొదటిసారి అయ్యండొచ్చు. ఊర్రూతలూంగించే పాట కాకపోయినా... వింటున్నంతసేపూ బావుంటుంది. కాకపోతే ఈ పాట, అంత:పురం సినిమాలోని ‘‘సై చిందేయ్...శిమెత్తర సాంబయ్యా...’’ ఆకాశమంతా సినిమాలో ‘ఒకనొక ఊరిలో ఒకే ఒక అయ్యా...’’ పాటలను మదిలో మెదిలేలా చేయడం కాకతాళీయమే కావచ్చు.
యాహు... యాహు... బోలో యాహు... యాహు... [మికా సింగ్]
జీవితాన్ని దేవీశ్రీ సంగీత ధోరణిలో చెప్పడానికి ప్రయత్నం చేసిన పాట ఇది... ‘‘సింగ్ ఇజ్ కింగ్’’ ఫేం... మికా సింగ్ గాత్రం బావున్నా... పేలవమయిన సాహిత్యం, ఉన్న కూసింత సాహిత్యాన్ని కూడా డామినేట్ చేసే సంగీతాలు కలిసి శ్రోతలను నిరాశ పరుస్తాయి. విజువల్ గా అయినా ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే ఈ పాట తొందరలోనే గతమైపోతుంది.
కాటుక కళ్ళను చూస్తే పోతుందే మది పోతుందే...[విజయ్ ప్రకాష్- అనిత ]
హీరో- హీరోయిన్ ల మధ్య సరదాగా సాగిపోయే లవ్ డ్యూయేట్ ఇది ఇలాంటి పాటలు దేవీశ్రీ గతంలో చాలానే చేశారు. విజయ ప్రకాష్, అనిత గాత్రాలు కూడా చాలా సాదాసీదాగా ఉన్నాయి. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం బావుంది.
ఆరుడుగుల అందగ్గాడు, నన్ను బార్బీ గర్ల్ అన్నాడు...[జష్ర్పీత్-సుచిత్ర ]
దేవిశ్రీ సహజ శైలిలో మొదలయిన ఈ పాట... మరొక ‘‘డియ్యాలో... డియ్యాలో’’ అంత హిట్ అవుతుందేమోననిపించింది. ఇంతలోనే కింగ్ సినిమాలో ‘‘ఎ టు జెడ్’’ పాట మ్యూజిక్ బ్లాక్, జస్ర్పీత్ బేస్ వాయిస్, చాలా వేగంగా సాగే సంగీతం, అరేబియన్ సంగీత శైలి వచ్చి మీదపడి ఈ పాటను పర్వాలేదనిపించాయి.
నీ చూపుల పొంగిన పొగరు...[కైలాష్ ఖేర్ ]
సినిమాలోని మరొక సిట్యయేషనల్ పాట ఇది. రామజోగయ్య శాస్త్రీ సాహిత్యానికి, దేవిశ్రీ సంగీతం ప్రాణం పోసింది. సినిమాలో ప్రేక్షకులు లీనం అవ్వడానికి ఈపాట దోహదపడుతుంది.
నీటిలోని చాపొచ్చీ... నేలమీద పడ్డట్టూ... [దేవిశ్రీ, గీతా మాధురి ]
దేవిశ్రీ... దేవిశ్రీ... దేవిశ్రీ, పాట వింటున్నంతసేపూ మదిలో కదలాడే రూపం. ‘కెవ్వు... కేక’’ ‘‘రింగ... రింగా’’, లాంటి ఫోక్ సాహిత్యానికి, తెలుగు నేటివిటీ సంగీతంతో పాటుగా, వెస్ట్రన్ మ్యూజిక్ ఇన్-స్ట్రమెంట్స్ ని వాడుతూ భావం చెడకుండా అభిమానులే కాదు... ఎవరైనా పాడుకునేంత తేలికగా, వినసొంపుగా చేయడం దేవిశ్రీకి తెలిసినంతగా ఈ తరం సంగీత దర్శకులలో మరెవ్వరికీ తెలియదేమో. ప్రభాస్ ట్రేడ్ మార్క్ పదం ‘‘డార్లింగ్’’ చుట్టూ రామజోగయ్య శాస్త్రీ అల్లిన ఈ పాటకు దేవిశ్రీ సంగీతమే కాదు, గాత్రం కూడా వినసొంపుగా ఉంది. మళ్ళీ, మళ్లీ వినాలనిపిస్తుంది.
చివరగా :
సింగిల్ కార్డు పాటల రచయిత స్థానానికి రామజోగయ్యశాస్త్రి న్యాయం చేశారు. ప్రభాస్ అభిమానులను ఆకట్టుకునే ఈ ఆల్బమ్... సగటు సీనీ ప్రేక్షకుడిని కూడా రంజింప చేసే విధంగా ఉంది.